మహారాష్ట్రను తాకిన రుతుపవనాలు, భారీ వర్షాలతో ముంబై అతలాకుతలం

First Published Jun 9, 2018, 5:00 PM IST
Highlights

రేపు కూడా భారీ వర్షాలు, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక

ముంబై నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇవాళ రుతుపవనాల రాకతో  ఈ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ వాఖ అధికారులు తెలిపారు. ఈ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీటమునిగిపోయాయి. దీంతో ప్రభుత్వం, నగరపాలక అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 

భారీ వర్షాల కారణంగా ముంబై రవాణ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా మారింది. ఇతర ప్రాంతాల నుండి రావాల్సిన పలు రైళ్లు రద్దవగా, మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నారు. లోకల్ ట్రైన్లు కూడా 20-25నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అలాగే పలు విమానాలు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి.  

 ఇక ఈ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడి పోతున్నారు. వర్షపు నీటితో రోడ్లన్ని జలమయమవడం, ద్వంసమవడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతోంది.  దీంతో స్కూళ్లకు వెళ్లే చిన్నారులు, ఆపీసులకు వెళ్లే పెద్దలు కూడా వర్షాలతో ఇబ్బందులు పడుతున్నారు.   దీంతో అత్యవసరమైతే తప్ప తమ వాహనాలు బైటికి తీయరాదని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు. 

పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికార యంత్రంగం చర్యలు చేపట్టింది.  శని, ఆదివారాల్లో అధికారులకు ప్రభుత్వం సెలవులను రద్దు చేసింది. అత్యవసర సహయం కోసం ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసి పర్యవేక్షణ భాద్యతలు అప్పగించారు.లోతట్టు ప్రాంతాల ప్రజలకు పునరావాస ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక మరో 72 గంటలు ముంబైతో పాటు మహారాష్ట్రను వర్షాలు ముంచెత్తబోతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.ముందు జాగ్రత్త చర్యగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. వీరికి వాకీ టాకీ లను అందించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేసుకుని అత్యవసర ప్రాంతాలకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. అలాగే వరద ప్రాంతాల్లో సహాయం చేయడానికి కావాల్సిన వస్తువులపు వారికి అందించారు.

మహారాష్ట్ర తో పాటు కర్ణాటక, గోవా ప్రాంతాల్లో కూడా ఈ భారీ వర్షాలు కొనసాగనున్నాయి. సముద్రం కూడా అల్లకల్లోలంగా మారడంతో మత్స్యకారులు కూడా వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. బీచ్ లలో కూడా సముద్ర స్నానాలు చేయకుండా ఏర్పాట్లు చేశారు. 

click me!