
Dakshina Kannada-Monkeypox: ఇంతకుముందు కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గజగజ వణికిచింది. ఇప్పటికీ అనేక దేశాల్లో వైరస్ విజృంభణ కొనసాగుతోంది. టీకాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయి. అయితే, కరోనా మహమ్మారి నుంచి కాస్త ఉపశమనం పొందుతున్న ప్రపంచ దేశాలను మరోముపు భయాందోళనకు గురిచేస్తోంది. అదే మంకీపాక్స్. సాధారణంగా ఆఫ్రికా దేశాల్లో కనిపించే ఈ మంకీపాక్స్ కేసులు ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాలకు వ్యాప్తి చెందుతున్నాయి. ఆయా దేశాల్లో క్రమంగా ఈ కేసులు పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య భారత్ లో కూడా మంకీపాక్స్ కేసులు గుర్తించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. దీని కట్టడి కోసం చర్యలు తీసుకోవడం ప్రారంభించాయి.
కేరళలో రెండు మంకీపాక్స్ కేసులను అధికారులు గుర్తించారు. దీంతో వారు ప్రయాణించిన ప్రాంతాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ వ్యాధి వ్యాప్తి తక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నప్పటికీ, మంగళూరులోని ప్రభుత్వ వెన్‌లాక్ ఆసుపత్రిలో 10 పడకల వార్డును మంకీపాక్స్ రోగులకు రిజర్వ్ చేస్తున్నారు. అధికారులు ఇతర చర్యలు తీసుకుంటున్నారు. విదేశాల నుండి వచ్చే ప్రయాణీకులందరినీ స్క్రీనింగ్ తో పాటు వారికి పరీక్షలు జరుపుతున్నారు. ఎందుకంటే సోమవారం నాడు మంకీపాక్స్‌కు పాజిటివ్ పరీక్షించిన కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన 31 ఏళ్ల వ్యక్తి .. జూలై 13న కన్నూర్‌కు బయలుదేరే ముందు దుబాయ్ నుండి మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. దీంతో రాష్ట్ర యంత్రాంగం ఆప్రమత్తమైంది. తగిన చర్యలు తీసుకోవాలని అక్కడి అధికారులను ఆదేశించింది. రెండు మంకీపాక్స్ కేసులు గుర్తించిన తర్వాత ఆరుగురిని ఐసోలేట్ చేశారు. ఇతరులను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరికీ వ్యాధి లక్షణాలు కనిపించలేదని, అందరినీ పర్యవేక్షిస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
కేరళలో రెండు Monkeypox కేసులు నిర్ధారణ కావడంతో దక్షిణ కన్నడ అధికారులు నిఘా ఉంచారు. కోవిడ్-19 సెంకడ్, థర్డ్ వేవ్ సమయాల్లో ఈ సరిహద్దు జిల్లా మూసివేయబడింది. కేరళ నుండి ప్రజల రాకపోకలు నియంత్రించబడ్డాయి. అప్పుడు కరోనావైరస్ ఆందోళనకు గురిచేయగా, ప్రస్తుతం ఈ ప్రాంతంలో మంకీపాక్స్ భయాలు నెలకొన్నాయి. కాగా, కేరళలో ఇప్పటివరకు రెండు మంకీపాక్స్ కేసులను గుర్తించారు. మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ రెండవ కేసు జూలై 13 న దుబాయ్ నుండి కన్నూర్ వచ్చిన 31 ఏళ్ల వ్యక్తిలో సోమవారం (జూలై 18) కేరళలో నిర్ధారించబడింది. కన్నూర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేరిన రోగి పరిస్థితి నిలకడగా ఉందని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.
మంకీపాక్స్ (Monkeypox) వ్యాధి మొదటి కేసు జూలై 14 న వచ్చిన వ్యక్తిలో నివేదించబడింది. UAE నుండి తిరిగి వచ్చిన 35 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్ సోకినట్టు గుర్తించారు. ప్రజారోగ్య చర్యలను అమలు చేయడంలో రాష్ట్ర అధికారులతో సహకరించడానికి ఉన్నత స్థాయి కేంద్ర బృందాన్ని కేరళకు పంపారు. మొత్తం 14 జిల్లాల్లో అలర్ట్ ప్రకటించగా, రాష్ట్రంలోని నాలుగు విమానాశ్రయాల్లో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు.