
Indo-China Border: అరుణాచల్ ప్రదేశ్‌లోని కురుంగ్ కుమే జిల్లాలోని భారత్-చైనా సరిహద్దు సమీపంలో 19 మంది రోడ్డు నిర్మాణ కార్మికులు గల్లంతు అయ్యారు. దామిన్ సర్కిల్ వద్ద బోర్డర్ రోడ్డు నిర్మాణంలో నిమగ్నమైన ఈ కూలీలు గత 14 రోజులుగా కనిపించకుండా పోయారు. ఈ ప్రాంతం రాజధాని ఇటానగర్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆచూకీ లేని కార్మికుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఒక కార్మికుడు మృతదేహాన్ని ఫురాక్ నదిలో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మరో 18 మంది అదృశ్యమయ్యారు. 19 మంది కార్మికులు అస్సాం నుంచి వలస వచ్చినట్లు తెలుస్తుంది. ఈ ఘటన జూలై 5 న జరిగినట్టు తెలుస్తుంది. జూలై 13వ తేదీన స్థానిక పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు ఇచ్చారు.
ఈ కూలీలందరూ రోడ్డు సంబంధిత ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నారని, జూలై 5 నుండి కనిపించకుండా పోయారని డిప్యూటీ కమిషనర్ బెంగియా నిఘి తెలిపారు. జూలై 13న కూలీలు కనిపించకుండా పోయారని తెలిసిందని, ఆ తర్వాత సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించామని ఆయన చెప్పారు. ఈ క్రమంలో సోమవారం కూలీ మృతదేహం లభ్యమైందని తెలిపారు. అందిన సమాచారం ప్రకారం.. ఈ మృతదేహాన్ని ఫురాక్ నది నుండి స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కేంద్రమైన కొలోరియాంగ్ నుండి అస్సాం నుండి ఒక కాంట్రాక్టర్ ఈ కూలీలను తీసుకువచ్చినట్లు డిప్యూటీ కమిషనర్ తెలిపారు.
నదిలో మునిగిపోవడం వల్లే మరికొందరు కూలీలు చనిపోయి ఉంటారని, అన్ని అవకాశాలను దృష్టిలో ఉంచుకుని నదిలో వెతుకుతున్నప్పటికీ, మిగతా మృతదేహాలు దొరికిన తర్వాతే ఎలాంటి నిర్ధారణ సాధ్యమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ కూలీల కుటుంబ సభ్యుల నుండి ఎవరికీ ఎటువంటి సమాచారం లేదు.
జూలై 5 నుండి కూలీలు కనిపించకుండా పోయారు, సుమారు రెండు వారాల తర్వాత, ఈ విషయం గురించి సమాచారం రావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు అసంతృప్తిని వ్యక్తం చేశారు. 15 రోజులుగా దాని సమాచారాన్ని ఎందుకు బహిరంగపరచలేదో కూడా చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.