అప్పుడు అభినందన్ దగ్గర గన్ లేకుంటే..!!!

By Siva KodatiFirst Published Mar 7, 2019, 5:41 PM IST
Highlights

శత్రు దేశ సైన్యానికి పట్టుబడినప్పటికీ, తీవ్రమైన గాయాలైనప్పటికీ ఏ మాత్రం భయపడకుండా సైనికుడిగా తన కర్తవ్యాన్ని నెరవేర్చిన భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌పై దేశప్రజలు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. 

శత్రు దేశ సైన్యానికి పట్టుబడినప్పటికీ, తీవ్రమైన గాయాలైనప్పటికీ ఏ మాత్రం భయపడకుండా సైనికుడిగా తన కర్తవ్యాన్ని నెరవేర్చిన భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌పై దేశప్రజలు అభినందనల వర్షం కురిపిస్తున్నారు.

బాలాకోట్‌తో పాటు మరికొన్ని ఉగ్రస్థావరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసింది... దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ కూడా భారత వైమానిక స్థావరాలను ధ్వంసం చేయాలని ప్రయత్నించింది.

ఈ క్రమంలో పాక్ యుద్ధ విమానాలను వెంబడించే క్రమంలో భారత పైలట్ అభినందన్ ఒక పాక్ విమానాన్ని కూల్చివేశాడు. అయితే ప్రత్యర్థుల దాడిలో ఆయన విమానం సైతం కూలిపోయింది.

దురదృష్టవశాత్తూ పాక్ భూభాగంలో దిగిన ఆయనను ఆ దేశసైన్యం పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అభినందన్ పాక్ సైన్యానికి చిక్కడానికి ముందు ఆయన ఎదుర్కొన్న పరిస్థితులపై ఓ జాతీయ మీడియా సంస్థ కథనం రాసింది.

మిగ్-21 విమానం కూలిపోయిన వెంటనే అభినందన్ పారాచూట్ సాయంతో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని హోరన్ గ్రామంలో దిగారు. అక్కడ కమ్రాన్ అనే వ్యక్తి వర్ధమాన్‌ని గమనించాడు.

పారాచూట్‌పై భారత జెండా ఉందని ఆ వ్యక్తి తెలిపాడు. మెల్లగా కిందకి దిగి వచ్చి ఇది ఇండియా, పాకిస్తానా అని అడిగాడు. ఇండియా అని చెప్పగానే మన ప్రధాని ఎవరు అని అడిగాడు అని కమ్రాన్ చెప్పాడు.

తాను శత్రుదేశపు భూభాగంలో దిగానని గుర్తించిన అభినందన్ వెంటనే తన వద్ద ఉన్న తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు. తన దగ్గర ఉన్న కొన్ని పత్రాలను మింగేసి, మిగిలిన వాటిని ముక్కలు ముక్కలుగా చేసి నీటిలో కలిపేస్తూ భారత్ మాతా కీ జై అని గట్టిగా అరిచాడు.

ఇదంతా గమనించిన స్థానిక అల్లరిమూక అభినందన్‌పై రాళ్లతో దాడి చేయడం ప్రారంభించారు. అక్కడికి చేరుకున్న పాకిస్తాన్ సైన్యం... ఆయనను అదుపులోకి తీసుకుంది. భారత పైలట్ నినాదాలు చేయగానే తమకు భయం వేసిందన్నాడు. 

అతడి దగ్గర గనుక తుపాకీ లేకపోయి ఉంటే రాళ్లతో కొట్టి చంపేవాళ్లమని.... అంతేకాకుండా అతను మాపై దాడి చేయకపోవడం కూడా మంచిదయ్యిందని కమ్రాన్ వ్యాఖ్యానించాడు. లేదంటే అక్కడున్న అల్లరి మూక చేతిలో పైలట్ ప్రాణాలు పోయేవని, తెలివిగా ఆలోచించి తన ప్రాణాలతో పాటు అపాయంలో పడకుండా చేశాడని అతను అన్నాడు.

ఆ తర్వాత పాకిస్తాన్ సైన్యం అభినందన్‌కు ప్రాథమిక చికిత్స అందించింది. జెనీవా ఒప్పందంతో పాటు అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గి అభినందన్‌ను విడుదల చేస్తున్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ పార్లమెంటులో ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అనంతరం అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ మధ్యవర్తిత్వంతో అభినందన్ తిరిగి స్వదేశాన్ని చేరాడు. 

click me!