అత్యాచార నిందితులు ప్రభుత్వోద్యోగాలకు అనర్హులు : అశోక్ గెహ్లాట్ సంచలన ప్రకటన

Siva Kodati |  
Published : Aug 08, 2023, 09:22 PM IST
అత్యాచార నిందితులు ప్రభుత్వోద్యోగాలకు అనర్హులు : అశోక్ గెహ్లాట్ సంచలన ప్రకటన

సారాంశం

రాజస్థాన్‌లోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అత్యాచార ఘటనలకు పాల్పడిన వారిని ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి గెహ్లాట్ ప్రకటన చేశారు. 

రాజస్థాన్‌లో అత్యాచారాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇటీవల ఓ బాలికపై అత్యాచారం చేసి ఆపై దారుణంగా హత్య  చేసి ఇటుకలబట్టీలో దహనం చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో రాజస్థాన్ ప్రభుత్వంపై ముప్పేట దాడి జరుగుతోంది. ఈ నేపథ్యంలో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అత్యాచార ఘటనలకు పాల్పడిన వారిని ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటించింది. 

 

 

ఇప్పటికే మహిళలపై అత్యాచారానికి పాల్పడిన వారు, గతంలో ఈ తరహా నేరాల్లో పాల్గొన్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వబోమని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటన చేశారు. ఈ మేరకు సీఎం ట్వీట్ చేశారు. ఇందుకోసం ప్రతి పోలీస్ స్టేషన్‌లో లైంగిక నేరస్తుల జాబితాను నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఉద్యోగానికి ఎంపిక చేసే ముందు స్థానిక పోలీస్ స్టేషన్లు, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కాండక్ట్ సర్టిఫికెట్లను పరిగణనలోనికి తీసుకుంటామని గెహ్లాట్ తెలిపారు. 

కాగా.. రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లా కోత్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో 14 ఏళ్ల మైనర్ బాలికను బొగ్గు కొలిమిలో దహనం చేసిన ఘటన దేశ వ్యాప్తంగా ఆందోళన రేకెత్తించింది. హత్యకు ముందు ఆమెపై సామూహిక అత్యాచారం కూడా జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఆ బాలిక అంత్యక్రియలు సోమవారం ఆమె స్వగ్రామంలో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, బంధువులు నిర్వహించారు. ఈ క్రమంలోనే తండ్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

ఈ హత్యాచార ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై రాజస్థాన్ గుర్జర్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ నాయకుడు కలులాల్ గుర్జార్, జిల్లా అధ్యక్షుడు శంకర్‌లాల్ గుర్జార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై బీజేపీ నేత విక్రమ్ గౌడ్ ట్విట్టర్ వేదికపై స్పందిచారు. ‘‘విషాదం! రాజస్థాన్‌లో మైనర్ బాలికపై అత్యాచారం చేసి బొగ్గు కొలిమిలో పడేశారు. కాలిపోయిన ఆమె మృతదేహాన్ని స్థానికులు వెలికితీశారు. కాంగ్రెస్ హయాంలో రాజస్థాన్‌లో మహిళల భద్రత జోక్‌గా మారింది’’ అని పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Smoking: ఇక చచ్చిన‌ట్లు స్మోకింగ్ మానేస్తారు.. 72 రూపాయలు కానున్న ఒక సిగరెట్ ధర.?
Vaikuntha Ekadashi: శ్రీరంగనాథ స్వామి ఆలయ వైభవం Drone View | Vaikuntha Dwaram | Asianet News Telugu