బిజెపి పరుగులు: వంద ర్యాలీల్లో మోడీ ప్రసంగాలు

By Nagaraju TFirst Published Jan 1, 2019, 4:36 PM IST
Highlights

సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాషాయదళం భారీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుంది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారీ ర్యాలీలు నిర్వహించే యోచనలో పడింది. 

ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాషాయదళం భారీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుంది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారీ ర్యాలీలు నిర్వహించే యోచనలో పడింది. 

దాదాపు 20 రాష్ట్రాల్లో 100 భారీ ర్యాలీలు నిర్వహించాలని ప్రధాని నరేంద్రమోదీ అలాగే బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. జనవరి 3 నుంచే ఈ భారీ ర్యాలీలను ప్రారంభించనుంది అధికార పార్టీ బీజేపీ. 

ఈ ర్యాలీలో ఎన్నికల ప్రచారంతోపాటు ప్రధానిమంత్రి నరేంద్రమోదీ గడచిన ఐదేళ్లలో తీసుకున్న నిర్ణయాలు, అలాగే కేంద్రప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలకు వివరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

అలాగే కేంద్రప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు మిశ్రమ ఫలితాలను ఇచ్చాయి. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలు సామాన్యుడిని సైతం ఇబ్బందులపాల్జేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఎందుకు అలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందోనన్న అంశంపై వివరణ ఇవ్వనుంది.  

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ ర్యాలీలు ఉండబోతున్నట్లు పార్టీ కార్యవర్గాలు చెప్తున్నాయి. మూడు నెలలుగా ప్రజల్లోకి వెళ్లాలని ప్రధాని నరేంద్రమోదీ, జాతీయ నాయకత్వం సన్నాహాలు చేస్తోంది. గత నెలలో ర్యాలీ అంశం ప్రతిపాదనకు వచ్చినట్లు తెలిసింది.  

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి తర్వాత మూడు భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి జనవరి 6న ఏపీలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటించాల్సి ఉంది. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆ పర్యటన కాస్త రద్దు అయ్యింది. అయితే సంక్రాంతి తర్వాత రెండు బహిరంగ సభల్లో మోదీ పాల్గొంటారని తెలుస్తోంది. 

click me!