ఆళగిరి ఎఫెక్ట్: డీఎంకె సమావేశంలో కన్నీళ్లు పెట్టుకొన్నస్టాలిన్

By narsimha lodeFirst Published Aug 14, 2018, 1:12 PM IST
Highlights

పార్టీని అందరూ ఐక్యంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని డీఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ అభిప్రాయపడ్డారు. డీఎంకె రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగళవారం నాడు చెన్నైలో  నిర్వహించారు.

చెన్నై: పార్టీని అందరూ ఐక్యంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని డీఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ అభిప్రాయపడ్డారు. డీఎంకె రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగళవారం నాడు చెన్నైలో  నిర్వహించారు.

కరుణానిధి మద్దతుదారులంతా తనవెంటే ఉన్నారని  కరుణానిధి తనయుడు  అళగిరి చేసిన ప్రకటన నేపథ్యంలో  ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. అళగిరిని 2014లో పార్టీ నుండి కరుణానిధి బహిష్కరించారు.

మరోవైపు గత ఏడాది  డీఎంకెకు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా స్టాలిన్ ను నియమించారు.  అయితే  డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడంపై  అళగిరి మండిపడ్డారు. ఆర్‌కె నగర్ ఉప ఎన్నికల్లో డీఎంకెకు డిపాజిట్ రాకపోవడంపై అళగిరి  తీవ్ర విమర్శలు చేశారు. స్టాలిన్  పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగినంత కాలం పార్టీకి విజయాలు దక్కవని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే కరుణానిధి మరణించిన తర్వాత  తొలిసారి పార్టీ  రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. పార్టీని బలోపేతం చేసేందుకు  అందరూ ఐకమత్యంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.  కరుణానిధి లేకుండా పార్టీని ఊహించలేమన్నారు.  

కరుణానిధి అంత్యక్రియల కోసం  స్థలాన్ని కేటాయించే విషయంలో  పళని ప్రభుత్వం  రాజకీయం చేసిందన్నారు.  పళనిస్వామి  ప్రభుత్వంపై నమ్మకం పోయిందని ఆయన చెప్పారు. కరుణానిధి ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలనేది కరుణానిధి కల అని ఆయన గుర్తు చేశారు. తాను  వర్కింగ్ ప్రెసిడెంట్ గా  అందరితో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నానని  వ్యాఖ్యానించారు.  స్టాలిన్ ఈ వ్యాఖ్యల ఉద్దేశ్యమేమిటనే విషయమై ఆసక్తికరంగా చర్చ సాగుతోంది.

పార్టీ సమావేశంలో స్టాలిన్ కంటతడి పెట్టుకొన్నారు. ఈ సమావేశంలో సీఎం పళనిస్వామి తీరుపై ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. మెట్టుదిగి సీఎం వద్దకు వెళ్లి అంత్యక్రియల కోసం స్థలం కేటాయించాలని కోరినా కానీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు.

కరుణానిధి సంతాపసభకు దేశంలోని పలు జాతీయ పార్టీల నేతలను కూడ ఆహ్వానించాలని నిర్ణయం తీసుకొన్నట్టు చెప్పారు.ఈ సమావేశంలో  స్టాలిన్ తో పాటు పలువురు కరుణానిధి కుటుంబసభ్యులు కూడ హాజరయ్యారు. అయితే ఆ సమావేశంలో అళగిరి ప్రస్తావన మాత్రం రాలేదు.
 

 

ఈ వార్తలు చదవండి

దేశం మొత్తం వచ్చినా.. మీరు ఎందుకు రాలేదు..? రజినీకాంత్ ఫైర్

డీఎంకెలో ఆళగిరి చిచ్చు: స్టాలిన్ మద్దతుదారుల్లో ఆందోళన, ఏం జరుగుతోంది?
 

click me!