
ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ లో ఓ దారుణ ఘటన వెలుగుచూసింది. కట్టుకున్న భర్తనే ఓ భార్య అతి కిరాతకంగా హతమార్చింది. ఆ తరువాత బెడ్రూంలో గొయ్యి తీసి పాతిపెట్టింది. తెలియకుండా దాని మీద ట్రంకు పెట్టె పెట్టింది. ఊహించడానికి కూడా వీలులేని ఈ ఘటన ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో కలకలం రేపింది. అయితే, భర్తను ఎందుకు చంపిందన్న విషయం ఇంకా తేలాల్సి ఉంది.
ఉత్తరప్రదేశ్ లో ఓ మహిళ తన భర్తను చంపి బెడ్రూంలో తవ్వి పాతిపెట్టింది. ఇంట్లోనుంచి దుర్వాసన వస్తుండడంతో మృతుడు సోదరుడు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి విచారించగా అసలు విషయం బయటపడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లో జరిగింది. దీంతో భర్త కనిపించడం లేదంటూ ఆ మహిళ చేసిన ఆరోపణలు అబద్ధం అని తేలింది.
అయితే, శవాన్ని వెలికి తీసిన తరువాత పోలీసులు ప్రశ్నించగా, తన భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని.. దీంతో తాను భయపడిపోయి.. భర్త శవాన్ని ఇంట్లో పూడ్చిపెట్టాని చెప్పింది. మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్న తరువాత పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. మృతుడిని గోవింద్ సింగ్ గా గుర్తించారు. గడియా రంగీన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కామరియా గ్రామానికి చెందిన వ్యక్తి. వ్యవసాయం చేస్తూ జీవించేవాడని తెలిసింది. ముగ్గురు అన్నాదమ్ముల్లో చిన్నవాడు.
వివాహేతర సంబంధం తిరస్కరించిందని.. మహిళను నగ్నంగా చేసి, తీవ్రంగా కొట్టి... ప్రియుడి ఘాతుకం..
అతను తన భార్య శిల్పి, ముగ్గురు పిల్లలతో షాజహాన్ పూర్ లో జీవిస్తున్నాడు. విచారణలో నిందితురాలు శిల్పి మాట్లాడుతూ.. ఆగస్ట్ 7వ తారీఖున తమిద్దరి మధ్య గొడవ జరిగిందని.. దీంతో భర్త ఉరివేసుకుని చనిపోయడని తెలిపింది. దీనికి సంబంధించి జలాల్ బాద్ సర్కిల్ ఆఫీసర్ మాసాసింగ్ మాట్లాడుతూ..‘ఇంట్లోనుంచి దుర్వాసన వస్తుందని ఓ ఫిర్యాదు మాకు అందింది. దీంతో అక్కడికి ఓ బృందాన్ని పంపాం. వారు ఆ ఇంటి బెడ్రూంలో ఓ మృతదేహాన్ని కనుక్కున్నారు. విచారణలో మృతుడి భార్య..అతను తనతో గొడవపడి ఉరేసుకుని చనిపోయాడని.. ఈ ఘటన ఆగస్ట్ 7న జరిగిందని తెలిపింది.
అతను చనిపోవడంతో భయపడిన తాను.. భర్తను బెడ్రూంలో గొయ్యి తీసి పాతి పెట్టానని.. దాని మీద ట్రంకు పెట్టె కప్పిపెట్టానని.. ఈ విషయం తన పిల్లలను తెలియదని చెప్పింది’ అని ఆయన అన్నాడు. అయితే ఆమె చెప్పిన దాంతో సంతృప్తి చెందని పోలీసులు పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చేదాకా ఏమీ తేల్చలేం అంటున్నారు. అయితే ఆమె పెద్ద కూతురు ఆరేళ్ల చిన్నారి ఘటన గురించి చెబుతూ.. తండ్రి చనిపోయిన రోజు.. తల్లితో బాగా గొడవ పడ్డారని.. ఆ తరువాత తల్లి, వేరే వ్యక్తితో కలిసి తండ్రిని గోతిలో పూడ్చిపెట్టిందని’తెలిపింది. దీంతో ఈ కేసులో మరోవ్యక్తి ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. రిపోర్ట్ వస్తేకానీ అసలు ఏం జరిగిందో తెలియదని పోలీసులు చెబుతున్నారు. ఈ హత్యకు భర్తతో గొడవలే కారణమా? వివాహేతర సంబంధమా? ఇంకా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.