
పాముని చూస్తేనే చాలా మంది భయపడిపోతారు. ఇక చిన్నపిల్లల సంగతి అయితే.. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటిది.. ఓ బుడ్డోడు పాము కరిచినా.. అదరలేదు.. బెదరలేదు. తనని కరిచిన పాముని చంపేసి.. దానిని పట్టుకొని ఆస్పత్రికి వెళ్లాడు. ఈసంఘటన తమిళనాడులో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తమిళనాడులోని కాంచీపురం ఏకనాంపేట్టకు చెందిన రాము కుమారుడు దర్షిత్ (7) మూడో తరగతి చదువుతున్నాడు. ఈనెల 16వ తేదీన బాలుడు తన గ్రామంలోని ఓ పొలంలో ఆడుకుంటూ ఉండగా... ఏదో కరిచినట్లు అనిపించింది. వెంటనే అక్కడ వెతకగా.. పాము కనపడింది.
ఏ మాత్రం భయపడకుండా.. ఆ పాముని పట్టుకొని చంపేశాడు. చచ్చిన పామును చేతపట్టుకుని ఇంటికి చేరుకుని తల్లిదండ్రులతో కలిసి కాంచీపురం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. పాము కాటేసినా బాలుడిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో రెండురోజులు ఆస్పత్రిలో ఉంచి పంపించేశారు. అయితే ఆ తరువాత బాలుడి కాలు వాచిపోయి ఆరోగ్యం విషమించడంతో మెరుగైన చికిత్స కోసం చెన్నై ఎగ్మూరులోని ప్రభుత్వ పిల్లల ఆస్పత్రికి తరలించారు. బాలుడు పూర్తిగా కోలుకోవడంతో మంగళవారం డిశ్చార్జ్ చేశారు.
ఇంటికి పంపే ముందు ఆ బాలుడితో ‘ఆస్పత్రికి చచ్చిన పామును తీసుకుని ఎందుకు వచ్చావు’ అని వైద్యులు ప్రశ్నించగా ‘నన్ను ఏ జాతి పాము కాటేసిందో తెలిస్తేనే కదా మీరు తగిన చికిత్స అందించేది’ అని సమాధానం చెప్పడం గమనార్హం.