20ఏళ్ల క్రితం విడిపోయిన దంపతులను కలిపిన చీఫ్ జస్టిస్ రమణ

By telugu news teamFirst Published Jul 29, 2021, 7:32 AM IST
Highlights

వీరి గురించి తెలిసిన వారెవ్వరూ.. వారు మళ్లీ కలుసుకుంటారని ఊహించి ఉండరు. కనీసం కలిసి జీవించాలనే కోరిక కూడా ఆ దంపతుల్లో లేదు. 

వారిద్దరికీ పెళ్లై దాదాపు 20ఏళ్లు దాటి పోయింది. పెళ్లై, బిడ్డ పుట్టిన సంవత్సరానికే వారు విడిపోయారు. వారు విడిపోయి ఇప్పటికి 20ఏళ్లు అవుతుంది. వీరి గురించి తెలిసిన వారెవ్వరూ.. వారు మళ్లీ కలుసుకుంటారని ఊహించి ఉండరు. కనీసం కలిసి జీవించాలనే కోరిక కూడా ఆ దంపతుల్లో లేదు. అలాంటివారికి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పిన మాటలు కనువిప్పు కలిగించాయి. కలలో కూడా కలవం అనుకున్న జంట.. మేము ఇక నుంచి కలిసి  జీవిస్తాం అనేలా చేశారు. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళితే...

గుంటూరు జిల్లా  గురజాల డిప్యూటీ తహశీల్దార్‌గా పనిచేస్తున్న శ్రీనివాసశర్మ, శాంతిలకు 1998లో వివాహం జరిగింది. ఈ దంపతులకు 1999లో ఒక కుమారుడు జన్మించాడు. అయితే ఆ తరువాత ఇంట్లో గొడవల కారణంగా 2001 నుంచి విడిపోయారు. అయితే తనపైన దాడి చేశారంటూ శాంతి పోలీసులను ఆశ్రయించారు. 

దీంతో శ్రీనివాసశర్మపై సెక్షన్ 498ఏ కింద కేసు నమోదు చేశారు. ఆ తరువాత గుంటూరులోని 6వ అడిషనల్ మున్సిప్ మెజిస్టేట్ కోర్టు శ్రీనివాసశర్మకు ఏడాది జైలుశిక్ష, రూ.1000 ఫైన్ విధించింది. అయితే శ్రీనివాసశర్మ హైకోర్టును ఆశ్రయించడంతో 2010 అక్టోబర్ 6వ తేదీన శిక్ష తగ్గిస్తూ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. హైకోర్టు తీర్పును శాంతి సుప్రీంకోర్టులో 2011లో సవాలు చేసింది. ఈ కేసుపై సీజేఐ ఎన్వీ రమణ, ఆన్‌లైన్‌లో విచారించారు. భార్యభర్తలను కలిపారు. 


నిజానికి సుప్రీంకోర్టు స్థాయిలో వాది, ప్రతివాదులను కోర్టుకు పిలవరు. వారి తరపు న్యాయవాదులే వాదిస్తూ ఉంటారు. కానీ ఇక్కడే ఎన్వీ రమణ తన ప్రత్యేకతను చాటుకున్నారు. సుదీర్ఘకాలంగా దూరంగా ఉన్న భార్యాభర్తల మనోగతాన్ని స్వయంగా వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా వారిద్దరూ కలిసి జీవితంలో ముందుకు సాగేలా వారికి నచ్చజెప్పారు. బాధితులు తెలుగులో వారి మనోవేదనలను తెలిపారు.  విచారణను సహచర న్యాయమూర్తి సూర్యకాంతకు ఇంగ్లీషులో ఎన్వీరమణ వివరించడం విశేషం.

click me!