కర్ణాటకలో విషాదం... బాలున్ని అమాంతం నదిలోకి లాక్కెళ్లిన మొసలి

By Arun Kumar PFirst Published Oct 25, 2021, 11:12 AM IST
Highlights

నదీతీరంలో చేపలు పడుతున్న ఓ యువకుడిపై దాడిచేసిన మొసలి అమాంతం నీటిలోకి లాక్కెళ్లిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.  

స్నేహితులంతా కలిసి సరదాగా గడిపేందుకు నదీతీరానికి వెళ్లారు. ఒడ్డున కూర్చుని నదిలో గాలం వేసి చేపలు పడుతుండగా ఓ యువకుడిపై మొసలి దాడిచేసి అమాంతం నీటిలోకి లాక్కెళ్లిపోయింది. ఈ దుర్ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే... Karnataka లోని ఉత్తర కన్నడ జిల్లా దాండేలి తాలూకా వినాయక నగర్ కు చెందిన మోహిన్ మహమూద్(15) ఆదివారం సెలవురోజు కావడంతో స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు కాళీ నదీ తీరానికి వెళ్లాడు. స్నేహితులంతా కలిసి ఒడ్డున కూర్చుని నీటిలో గాలం వేసి చేపలవేటకు దిగారు. 

ఈ క్రమంలో మోహిన్ కూడా నదిఒడ్డున ఓచోట కూర్చుని గాలం వేసి చేపలు పడుతున్నాడు. ఈ సమయంలోనే ఓ Crocodile నీటిలో మెళ్లిగా వచ్చి ఒక్కసారిగా మోహిన్ పై దాడిచేసింది. అమాంతం అతడిని నీటిలోకి లాక్కుని వెళ్లిపోయింది. 

read more  దంపతుల ఘాతుకం: క్షుద్రపూజలు.. సెక్స్ వర్కర్లని ట్రాప్ చేసి, పిల్లల కోసం బలి

దీంతో భయబ్రాంతులకు గురయిన మిగతా యువకులు పరుగున వెళ్లి గ్రామస్తులకు తెలిపారు. గ్రామస్తులంతా కలిసి నదిలో ఎంత గాలించినా ఎక్కడా మొసలి జాడ గానీ, బాలుడి జాడగానీ కనిపించలేదు. దీంతో వారు చేసేదేమిలేక పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

పోలీసులు కూడా గజ ఈతగాళ్లను రప్పించి నదిలో వెతికించినా ఫలితం లేకుండా పోయింది. బాలుడి జాడ కోసం గాలింపు కొనసాగుతూనే వుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరదనీటితో పాటు మొసళ్లు కూడా కాళీ నదిలోకి వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం తెలియన నది వద్దకు వెళుతూ ప్రమాదాలకు గురవుతున్నారని... తాజాగా యువకుడి ఘటన కూడా అలాంటిదేనన్నారు. ఇకపై మరెవ్వరూ నదిలోని మొసళ్ల బారిన పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 

యువకుడి గల్లంతుతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మోహిన్ కుటుంబసభ్యలు నదివద్దే బోరున విలపిస్తున్నారు. యువకుడి ఆచూకీ కోసం నదిలో గాలింపు కొనసాగుతోంది. 
 
 
 

click me!