
మనీలాండరింగ్ (money laundering) ఆరోపణలతో అరెస్టయి, విచారణను ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ (Nawab Malik) నిర్వహిస్తున్న శాఖలను తొలగించి, తాత్కాలికంగా ఇతర మంత్రులకు కేటాయించాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ నాయకుడు, మంత్రి జయంత్ పాటిల్ (Jayant Patil) వివరాలు వెల్లడించారు. అయితే నవాబ్ మాలిక్ నుంచి మాత్రం రాజీనామాను తీసుకోబోమని మంత్రి తెలిపారు.
‘‘ ఆయన మంత్రిగా కొనసాగుతారు. మేము అతని రాజీనామాను తీసుకోవడం లేదు. అతను అరెస్టు అయినందున తన విధులు నిర్వహించలేకపోతున్నాడు. కాబట్టి ఆయన బాధ్యతలను తాత్కాలికంగా వేరే వ్యక్తులకు అప్పగిస్తాం. అలాగే ప్రస్తుతం నవాబ్ మాలిక్ నిర్వర్తిస్తున్న NCP ముంబై అధ్యక్ష బాధ్యతలను తాత్కాలికంగా నరేంద్ర రాణే (Narendra Rane), రాఖీ జాదవ్ (Rakhi Jadhav)లకు అదనపు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా బాధ్యతలు అప్పగిస్తాం.” అని మీడియా ప్రతినిధులను ఉద్దేశించి పాటిల్ తెలిపారు. అయితే ప్రస్తుతం వరకు నవాబ్ మాలిక్ ఎన్ సీపీ ముంబై చీఫ్ గా, పర్బానీ, గోండియా జిల్లాలకు ఇంఛార్జ్ మినిస్టర్ గా కూడా ఉన్నారు.
‘‘ మాలిక్ ఇంఛార్జ్ మినిస్టర్ గా ఉన్న పర్భానీ, గోండియా జిల్లాల బాధ్యతలను సామాజిక న్యాయ శాఖ మంత్రి ధనంజయ్ ముండే, పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ప్రజాక్త్ తాన్‌పురేకు అప్పగిస్తారు. ఈ మార్పులకు సంబంధించిన విషయాలను ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్తాం’’ అని జయంత్ పాటిల్ తెలిపారు.
ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు సమాచారం అందించిన తర్వాత అధికారికంగా ఈ వివరాలు ప్రకటిస్తామని జయంత్ పాటిల్ తెలిపారు. మాలిక్‌కు న్యాయం జరిగే వరకు ఇదే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అని చెప్పారు. 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని బీజేపీ (bjp) నేత దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యపై పాటిల్ మాట్లాడుతూ.. ‘‘ 2024 వరకు కూటమి అధికారంలో ఉంటుందని చెప్పినందుకు మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) తరపున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ప్రతిపక్షంలో కూర్చున్నారు, సరైన ప్రత్యర్థిగా వ్యవహరించండి ఇదే వారికి మా సలహా ’’ అని ఆయన తెలిపారు.
MVA ప్రభుత్వం బీజేపీ నాయకులను, తనను టార్గెట్ చేసేందుకు కుట్రపన్నుతోందని ఇటీవల మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్ ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన మహారాష్ట్ర అసెంబ్లీలో పెన్ డ్రైవ్ ను సాక్ష్యంగా సమర్పించారు. అయితే దీనిపై మంత్రి జయంత్ పాటిల్ మాట్లాడుతూ.. ‘‘ పెన్ డ్రైవ్‌లోని కంటెంట్ లో ప్రామాణికత అవసరం. నిజాన్ని తనిఖీ చేయకుండా ప్రజల ముందు ప్రదర్శించడం తప్పు ’’ అని ఆయన తెలిపారు.
దావూద్ ఇబ్రహీం మనీలాండరింగ్ కేసులో మాలిక్ ఫిబ్రవరి 23న అరెస్టయ్యాడు మరియు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ఇటవలే ఆయన తరుఫు న్యాయవాది బాంబే హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. వెంటనే మాలిక్ ను కస్టడీ నుంచి విడుదల చేయాలని కోరారు. అయితే ఈ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. హెబియస్ కార్పస్ పిటిషన్ కాకుండా రెగ్యులర్ బెయిల్ కోరాలని సూచించింది.