
Karnataka earthquake:కర్ణాటకలో స్వల్ప భూకంపం సంభవించింది. విజయపుర జిల్లాలోని ఇనాపురా, చుట్టుపక్కల గ్రామాల్లో తెల్లవారుజామున 1.38 గంటలకు స్వల్ప భూకంపం సంభవించిందని సంబంధిత అధికారులు తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. విజయపుర జిల్లా వ్యాప్తంగా గురువారం తెల్లవారుజామున రిక్టర్ స్కేలుపై 3.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. కర్ణాటక రాష్ట్ర సహజ విపత్తు నిర్వహణ కమిటీ (KSNDMC) ప్రకారం, విజయపుర జిల్లాలోని ఇనాపురా, చుట్టుపక్కల గ్రామాలలో ఉదయం 1.38 గంటలకు స్వల్ప భూకంపం సంభవించింది. అయితే ప్రాణ నష్టం, ఆస్తినష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదు. ఇటీవలి కాలంలో పదే పదే భూ ప్రకంపనలు చోటుచేసుకోవడం ఈ ప్రాంత ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
పదేపదే భూ ప్రకంపనల సంఘటనలు నివేదించిన తరువాత, బెంగళూరు నుండి నిపుణుల బృందం ఈ ప్రాంతాన్ని సందర్శించి తనిఖీలు నిర్వహించింది. పొరుగున ఉన్న కలబురిగి జిల్లా ప్రాంతాలు కూడా భూమి ప్రకంపనలు, భూమి నుండి భారీ శబ్దం వెలువడుతున్నాయి. తనిఖీలు నిర్వహించిన నిపుణుల బృందం భయాందోళనలకు చెక్ పెట్టింది.
ఇదిలావుండగా, మంగళవారం ఉదయం 7:38 గంటలకు లద్దాఖ్ లో 4.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. కార్గిల్ కు 401 కిలోమీటర్ల దూరంలో 150 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. అయితే, ఈ భూకంపంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. అంతకుముందు, లేహ్-లడఖ్ ప్రాంతంలో జూన్ 18న 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. జమ్ముకశ్మీర్ లోని దోడా జిల్లాలో ఒకే రోజు తెల్లవారుజామున రెండు భూప్రకంపనలు సంభవించాయి.