భారత్‌కు యూరప్‌ను మరింత చేరువ చేసే ప్రాజెక్టు మిడిల్ ఈస్ట్ ట్రేడ్ టెక్ కారిడార్ పై ఈ రోజు మూడు రీజియన్‌లోని దేశాల ముఖ్య నేతల సమక్షంలో ప్రకటన వెలువడింది. వయా సౌదీ అరేబియా ద్వారా యూరప్ దేశాలకు భారత్ తన గూడ్స్‌ను 72 గంటల్లో చేర్చే ప్రాజెక్టే ఈ మిడిల్ ఈస్ట్ ట్రేడ్ కారిడార్.
న్యూఢిల్లీ: మన దేశం, మనకు మిత్రదేశమైన యూఏఈతో రెండేళ్ల క్రితం ఓ ప్రాజెక్టు గురించి చర్చ జరిగింది. ఈ రోజు ఢిల్లీలో దీనిపై కీలక ప్రకటన చేశారు. జీ 20 సమావేశాలు జరుగుతుండగా.. ఈ ప్రాజెక్టుపై మూడు రీజియన్‌లకు చెందిన దేశాల నేతలు అమెరికాకు చెందిన పార్ట్‌నర్షిప్ ఫర్ గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ మద్దతు ఈ ప్రకటన చేశారు.
భారత జాతీయ భద్రతా సలహాదారు, యూఏఈ, యూఎస్ఏల భద్రతా సలహాదారులు సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ మద్దతుతో చాలా సార్లు సమావేశమై ఈ ప్రాజెక్టు గురించి చర్చలు చేశారు. ఈ ప్రాజెక్టును ఇప్పుడు మిడిల్ ఈస్ట్ ట్రేడ్ టెక్ కారిడార్ అని పిలుస్తున్నారు. వయా సౌదీ అరేబియా ద్వారా ఈ ప్రాజెక్టు మనకు యూరప్ దేశాలను మరింత చేరువకు తీసుకురానుంది. మన దేశం నుంచి యూరప్‌కు 72 గంటల్లో షిప్పింగ్ పూర్తయ్యేలా ఈ ప్రాజెక్టు రూపకల్పన చేస్తున్నారు.
మన దేశం నుంచి ప్రమాణాత్మక కంటైనర్లు భారత్ నుంచి యూఏఈకి చెందిన ఫుజైరా పోర్టుకు చేరుతాయి. అక్కడి నుంచి జోర్డాన్ గుండా ఇజ్రాయెల్‌కు చెందిన హైఫా పోర్టు వరకు సుమారు 2650 కిలోమీటర్ల దూరం ఈ గూడ్స్ రైల్ రోడ్ మార్గాల్లో వెళ్లుతుంది. యూఏఈ నుంచి జోర్డాన్‌ల మధ్య ఇప్పటికి 1,850 కిలోమీటర్ల దూరం రైల్ రోడ్డు నిర్మాణం ఉన్నది. మిగిలిన భాగాలను నిర్మించి పూర్తి చేయాలని సౌదీ అరేబియా ప్రణాళికలు వేస్తున్నది. హైఫా పోర్టు నుంచి యూరప్ దేశాలకు సులువుగా వెళ్లవచ్చు. చాలా సమీపం కూడా. తద్వార భారత్, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచీ గూడ్స్ ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్‌లలోని పోర్టులకు షిప్పింగ్ తక్కువ దూరం(ప్రస్తుత మార్గంతో పోలిస్తే)తో సాధ్యమవుతుంది.
భారత్, యూఎస్, యూఏఈ, సౌదీ అరేబియా దేశాలు ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టులో ఇప్పుడు ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల నేతలు కూడా చేరారు. మిడిల్ ఈస్ట్ కారిడార్‌ను దశల వారీగా పూర్తి చేయాలని భావిస్తున్నారు.
భవిష్యత్‌లో వియత్నాం నుంచి కూడా గూడ్స్ మయన్మార్, బంగ్లాదేశ్ మీదుగా భారత్‌కు వస్తే.. అక్కడి నుంచి యూరప్‌కు తరలించవచ్చనే ప్రణాళికలు ఉన్నాయి. భారత గూడ్స్ యూరప్‌కు కేవలం 72 గంటల్లో చేరేలా ఈ ప్రాజెక్టు ఉంటుంది. హైఫా పోర్టును ప్రస్తుతం భారత కంపెనీ ఆపరేట్ చేస్తున్నదని ఓ అధికారి తెలిపారు.
దుబాయి, జెడ్డాలలో గత రెండున్నరేళ్లుగా ఈ ప్రాజెక్టు గురించి సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మళ్లీ ఢిల్లీలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రకటన వెలువడింది.
ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, సౌదీ పీఎం మొహమ్మద్ బిన్ సల్మాన్, యూఏఈ ప్రెసిడెంట్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఈయూ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సుల వొన్ డిర్ లెయెన్, జర్మనీ చాన్సిలర్ ఒలాఫ్ షోల్జ్, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయెల్ మ్యాక్రన్, ఇటలీ పీఎం జార్జియా మెలోనీల సమక్షంలో ఢిల్లీలో ఈ ప్రకటన వెలువడింది. ఈ ప్రాజెక్టు ముఖ్యమైన మూడు రీజియన్‌లకు వాణిజ్యం, సాంకేతికపరంగా కలిపే వారధిగా మారుతుందని భావిస్తున్నారు.