G20 Summit: ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం గురించి న్యూఢిల్లీ డిక్లరేషన్‌ ఏం చెబుతోంది? పశ్చిమ దేశాలు మెట్టుదిగాయా?

By Mahesh K  |  First Published Sep 9, 2023, 7:48 PM IST

ఉక్రెయిన్ పై యుద్ధం సహా పర్యావరణ మార్పు, ఆహారభద్రత, ఆర్థిక ప్రయోజనాలు, మహమ్మారులను ఎదుర్కొనే సన్నద్ధత వంటి అంశాలపై న్యూఢిల్లీ డిక్లరేషన్‌పై సభ్యదేశాలు సమ్మతం తెలిపాయి. అన్ని అంశాలు ఒక ఎత్తయితే.. రాజకీయంగా ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది. అందుకే ఉక్రెయిన్ పై రష్యా దాడి గురించి న్యూఢిల్లీ డిక్లరేషన్‌పై సమ్మతం తెలిపి పశ్చిమ దేశాలు ఒక మెట్టుదిగాయా? అనే చర్చ మొదలైంది.
 


న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జీ 20 శిఖరాగ్ర సదస్సు సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు సమావేశంలో న్యూఢిల్లీ డిక్లరేషన్ పై సభ్యదేశాల ఏకాభిప్రాయం కుదిరినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలు పెట్టిన కారణం, పర్యావరణ మార్పుల్లో దేశాలు భిన్నవైఖరులపై మొగ్గు చూపడం వంటి అంశాల నేపథ్యంలో అంతర్జాతీయ వేదికపై దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. భిన్నాభిప్రాయాలతో ఒక డిక్లరేషన్ పై సమ్మతి లభించడం కష్టంగా మారింది. ఈ ఏడాది భారత అధ్యక్షతనలో ఢిల్లీలో సమావేశమైన జీ 20 సదస్సులో ఇది సాధ్యమైంది. దీన్ని భారత్ సాధించిన విజయంగా చూస్తున్నారు. ఈ డిక్లరేషన్‌కు సంబంధించి కొన్ని కీలక అంశాలు చూద్దాం.

ఉక్రెయిన్ పై ‘బలప్రయోగం’

Latest Videos

జీ 20 సదస్సులో న్యూఢిల్లీ డిక్లరేషన్ పై అన్ని దేశాల ఏకాభిప్రాయంపై నిన్నటి వరకు నీలినీడలున్నాయి. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి సంబంధించి ఈ గ్రూపులోని దేశాల మధ్య ఏకాభిప్రాయం లేదు. ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన దేశం రష్యా సభ్యదేశంగా ఉన్న ఈ గ్రూపులో ఈ యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అమెరికా వంటి పశ్చిమ దేశాలు ఉన్నాయి.

కానీ, న్యూఢిల్లీ డిక్లరేషన్ పై అన్ని దేశాల సమ్మతం లభించడంతో చాలా మంది ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం గురించే చర్చించారు. అయితే.. డిక్లరేషన్ గురించి కీలక విషయాలు బయటికి వచ్చాయి. ఈ డిక్లరేషన్ భాషలో చాలా వరకు మార్చినట్టు తెలిసింది. నేరుగా రష్యాను వేలెత్తి చూపలేదు. రష్యాను నేరుగా విమర్శలు చేయలేదు. ఉక్రెయిన్ పై రష్యా దాడికి దిగింది అని కాకుండా.. ఉక్రెయిన్ పై బలప్రయోగాన్ని సమర్థించడం లేదని పేర్కొన్నారు. అలాగే.. నేరుగా రష్యాను పేర్కొనకుండా.. పరోక్షంగా అణ్వాయుధాలను వాడుతామని, లేదా వాడుతామని బెదిరించడమైనా ఎట్టిపరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదనే వాక్యం వాడారు. ఉక్రెయిన్‌లో అన్ని రూపాల్లో, అన్ని విధాల శాంతి, న్యాయం కోసం మాత్రమే ఈ సభ్యదేశాలు ఉమ్మడిగా పిలుపు ఇచ్చాయి. మన దేశంలోని జీ 20 సదస్సులో మరో విషయంపై స్పష్టత ఇచ్చారు. జీ 20 సదస్సు అనేది భౌగోళిక రాజకీయాలకు, సెక్యూరిటీకి సంబంధించిన అంశాలపై ఫోకస్ పెట్టదని, ఈ కూటమి ఆర్థిక వ్యవహారాల ప్రయోజనాలపై చర్చిస్తుందని చెప్పారు.

Also Read : G20 Summit 2023: న్యూఢిల్లీ డిక్లరేషన్‌కు జీ 20 దేశాల ఆమోదం: ప్రకటించిన ప్రధాని మోడీ

ఇలాగైనా.. పశ్చిమ దేశాలు ఒక రకంగా మెట్టుదిగాయనే చెప్పాలి. గతేడాది ఇండోనేషియాలో జీ 20 సదస్సులో రష్యాపై నేరుగా పేర్కొంటూ విరుచుకుపడ్డాయి. పరుషమైన పదజాలం వాడుతూ దునుమాడాయి. న్యూఢిల్లీ డిక్లరేషన్ విషయానికి వస్తే రష్యాపైన అక్కసు ఉన్నప్పటికీ నేరుగా పేర్కొనలేదు. వారి అభ్యంతరాలను కూడా కటువుగా కాకుండా మృదువైన భాషలో పొందుపరిచారు. ఇది ఆ దేశాల వైఖరిలో మార్పు అని చెప్పడానికి లేదు. స్థూలంగా చూస్తే ఇండోనేషియాలో వ్యక్తపరిచిన అభిప్రాయాలకే ఈ దేశాలు కట్టుబడి ఉన్నట్టు అర్థం అవుతుంది.

click me!