#మీటూ ఎఫెక్ట్: రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు

By Nagaraju TFirst Published Oct 24, 2018, 7:03 PM IST
Highlights

 దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న#మీటూ ఉద్యమంపై ఎట్టకేలకు కేంద్రం దిగొచ్చింది. మహిళలు తమపై జరిగిన లైంగిక దాడులను మీటూ వేదికగా బహిరంగ పరుస్తున్నారు. దీంతో లైంగిక దాడులకు గురైన మహిళలు పెద్ద సంఖ్యలో మీటూ ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారు. 

ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న#మీటూ ఉద్యమంపై ఎట్టకేలకు కేంద్రం దిగొచ్చింది. మహిళలు తమపై జరిగిన లైంగిక దాడులను మీటూ వేదికగా బహిరంగ పరుస్తున్నారు. దీంతో లైంగిక దాడులకు గురైన మహిళలు పెద్ద సంఖ్యలో మీటూ ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారు. 

ఈ నేపథ్యంలో పని ప్రదేశాల్లో మహిళల పట్ల జరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నలుగురు మంత్రులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన ఈ బృందం పనిచేయనుంది. కేంద్రమంత్రులు నితిన్‌ గడ్కరీ, నిర్మలా సీతారామన్‌, మేనకా గాంధీ బృందంలో సభ్యులుగా నియమిస్తూ   హోంమంత్రిత్వ శాఖ ఓ ప్రకటన వెల్లడించింది. 

ఈ నలుగురు మంత్రుల బృందం పని ప్రదేశాల్లో మహిళల పట్ల జరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టేందుకు తీసుకోవాల్సిన న్యాయపరమైన అంశాలపై చర్చిస్తోంది. 
ఇప్పటికే ఉన్న నిబంధనల అమలు ప్రక్రియ సమర్థవంతంగా జరిగేలా చూడటం, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను పరిష్కరించేందుకు అవసరమైన చట్టపరమైన అంశాలను కమిటీ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటుందని ప్రకటనలో పేర్కోంది. 

కేంద్రమంత్రి ఎంజే అక్బర్‌ తమను లైంగికంగా వేధింపులకు గురి చేశారంటూ దాదాపు 15 మందికి పైగా మహిళా పాత్రికేయులు మీటూలో భాగంగా ఆరోపణలు చేశారు. ఆరోపణల నేపథ్యంలో తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు ఎంజే అక్బర్. సినీ, క్రీడా, రాజకీయ రంగాల్లో మీటూ తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఈ నేపథ్యంలోనే న్యాయపరమైన నిపుణులతో ఓ ప్రత్యేక కమిటీ నియమించాలనే ప్రతిపాదనను తీసుకొచ్చినట్లు అక్టోబర్ 12న కేంద్రమంత్రి మేనకా గాంధీ ప్రకటించారు. 

లైంగిక వేధింపుల గురించి బాధితులు నేరుగా ఫిర్యాదులు చేసేలా ప్రత్యేక సదుపాయాన్ని కల్పించినట్లు కేంద్రమంత్రి మేనకా గాంధీ ప్రకటించారు. షీ బాక్స్‌(www.shebox.nic.in) ద్వారా లైంగిక వేధింపుల ఫిర్యాదులు చేయొచ్చని సూచించారు. అలాగే wcd@nic.in ద్వారా కూడా ఫిర్యాదులు చేయోచ్చు అని తెలిపారు. ఈ కేసులను నలుగురు మంత్రుల బృందం పర్యవేక్షిస్తోందని ప్రకటనలో తెలిపారు. 

click me!