తొమ్మిది మైటీ తీవ్రవాద సంస్థలపై ఐదేళ్ల నిషేధం:కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం

By narsimha lode  |  First Published Nov 13, 2023, 6:05 PM IST

మణిపూర్ లో  మైటీ, కుకీ తెగల మధ్య పోరాటం నేపథ్యంలో  కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న  మైటీ తీవ్రవాద సంస్థలపై ఐదేళ్ల నిషేధం విధించింది కేంద్రం.


న్యూఢిల్లీ: భారత దేశంలోని  ఈశాన్య ప్రాంతంలో  హింసను నివారించేందుకు  కేంద్ర హోంశాఖ  కీలక నిర్ణయం తీసుకుంది.  మైటీ  తీవ్రవాద సంస్థలను చట్టవిరుద్దమైన సంఘాలుగా ప్రకటించింది.

చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద కేంద్ర హోంమంత్రిత్వశాఖ సోమవారంనాడు ఈ నిర్ణయం తీసుకుంది.

Latest Videos

వేర్పాటువాద, విధ్వంసక, తీవ్రవాద, హింసాత్మక కార్యకలాపాలను ఎదుర్కోవడమే లక్ష్యంగా పెట్టుకొన్నట్టుగా కేంద్ర హోంశాఖ తెలిపింది.  మణిపూర్ లో భద్రతా బలగాలు, పోలీసులు, పౌరులపై దాడులతో పాటు భారతదేశం సార్వభౌమాధికారం, సమగ్రతకు హనికరమైన కార్యకలాపాలలో ఈ సంస్థలు పాల్గొన్నాయని కేంద్ర హోం మంత్రిత్వశాఖ  నవంబర్ 13, 2023 న నోటిఫికేషన్ జారీ చేసింది.

పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) దాని రాజకీయ విభాగం  రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్(ఆర్‌పీఎఫ్) తో  పాటు యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (యుఎన్ఎల్ఎఫ్) దాని సాయుధ విభాగం , మణిపూర్ పీపుల్స్ ఆర్మీ(ఎంపీఏ), పీపుల్స్  రివల్యూషనరీ పార్టీ ఆఫ్ కంగ్లీపాక్(పీఆర్‌ఈపీఎకే), రెడ్ ఆర్మీ అని పిలవబడే  దాని సాయుధ విభాగం  కంగ్లీపాక్ కమ్యూనిస్టు పార్టీ(కేసీపీ), రెడ్ ఆర్మీ విభాగం, కంగ్లీ యావోల్ కాన్బలుప్ (కేవైకేఎల్), కోఆర్డినేషన్ కమిటీ(కేఓఆర్ కామ్), అలయన్స్ ఫర్ సోషలిస్ట్  యూనిటీ ( ఎఎస్ యుకే) లను  చట్టవిరుద్దమైన సంఘాలుగా కేంద్ర హోంమంత్రిత్వశాఖ గుర్తించింది.ఈ మేరకు ఆ నోటిఫికేషన్ లో  ఈ సంస్థల పేర్లను  పేర్కొంది.

ఈ సంస్థలపై  విధించిన నిషేధం సోమవారం నుండి ఐదేళ్ల పాటు అమల్లో ఉంటుంది.  సాయుధ పోరాటం ద్వారా మణిపూర్ ను భారతదేశం నుండి  వేరు చేసి స్వతంత్ర దేశాన్ని  ఏర్పాటు చేయడం కోసం స్థానిక ప్రజలను ప్రేరేపించడమే ఈ సమూహాల లక్ష్యంగా  కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

మైటీ సంస్థలు ఏం చేస్తున్నాయంటే

భారత దేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు హానికరమైన కార్యకలాపాలలో  నిమగ్నమయ్యాయి.

తమ లక్ష్యాల సాధనకు సాయుధ మార్గాన్ని ఎంచుకోవడం

మణిపూర్ లో భద్రతా బలగాలు,పోలీసులు, పౌరులపై దాడి చేసి చంపడం.

తమ సంస్థలకు  అవసరమైన నిధులను  ప్రజల నుండి  బెదిరించి దోచుకొంటున్నారు.

ప్రజాభిప్రాయం ప్రభావితం చేయడానికి విదేశీయులతో పరిచయాలను ఏర్పాటు చేసుకోవడం, వేర్పాటువాద లక్ష్యాల కోసం ఆయుధ శిక్షణ పొందుతున్నారు.

ఆయుధ శిక్షణ కోసం  ఇతర దేశాలకు రహస్యంగా వెళ్తున్నారు.  ఆయుధాలు, మందుగుండు సామాగ్రి వినియోగంలో శిక్షణ పొందుతున్నారు.

ఈ సంస్థల కార్యకలాపాలు భారత సార్వభౌమాధికారం, సమగ్రతకు హనికరంగా పరిగణించబడ్డాయని  కేంద్ర హోంమంత్రిత్వశాఖ పేర్కొంది.

భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు విరుద్దమైన శక్తుల సహకారంతో  దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనడమే కాకుండా, ప్రచారం చేస్తున్నారు.

మణిపూర్ లో కొనసాగుతున్న హింసకు  ప్రతిస్పందనగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. ఈశాన్య రాష్ట్రంలోని  మెైటీ, గిరిజన కుకీ తెగల మధ్య  ఈ ఏడాది మే 3న ఘర్షణలు చెలరేగాయి.  ఈ ఘర్షణల్లో  సుమారు  178 మంది మరణించారు. కనీసం  50వేల మంది నిరాశ్రయులయ్యారు.

click me!