ఇండియాలో జైళ్లు బాగోవట.. అందుకే ‘‘మాల్యా, ఛోక్సీ’’ ఇండియా రారంట..!!

By sivanagaprasad KodatiFirst Published 27, Aug 2018, 12:13 PM IST
Highlights

దేశంలోని బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన ఆర్థిక నేరగాళ్లు అరెస్ట్‌లకు భయపడి ప్రపంచంలోని ఏదో ఒక మూల తలదాచుకుంటున్నారు. అరెస్ట్ కావడం తప్పదని తెలిసిన పక్షంలో దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కూడా ఆర్థిక నేరగాళ్లు వెనుకాడటం లేదు

దేశంలోని బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన ఆర్థిక నేరగాళ్లు అరెస్ట్‌లకు భయపడి ప్రపంచంలోని ఏదో ఒక మూల తలదాచుకుంటున్నారు. అరెస్ట్ కావడం తప్పదని తెలిసిన పక్షంలో దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కూడా ఆర్థిక నేరగాళ్లు వెనుకాడటం లేదు.

భారత జైళ్లు నరకానికి చిరునామాలని, గాలి, వెలుతురు ఉండవని, శుభ్రత కనిపించదంటూ కొద్దిరోజుల క్రితం కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా ఆరోపణలు చేయడంతో.. ఆయన్ను భారత్‌కు అప్పగించే విషయంపై విచారణ చేస్తున్న యూకే కోర్టు ఇండియాలో జైళ్ల పరిస్థితిపై తమకు వీడియో ఆధారాలు కావాలని ఆదేశించింది. దీంతో ఆయన్ను ఉంచాలనుకుంటున్న ముంబై ఆర్థర్ రోడ్‌లోని జైలు నెంబర్ 12 బ్యారక్‌ గదిని వీడియో తీసి సీబీఐ యూకే కోర్టుకు సమర్పించింది.

దీనిలో ఎల్‌ఈడీ టీవీ, పర్సనల్ టాయిలెట్, బెడ్, వాష్ చేసుకునే ఏరియా, వెలుతురు పడేలా ఏర్పాట్లు ఉన్నాయని తెలిపింది. తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో కీలక నిందితుడిగా ఉన్న మొహుల్ ఛోక్సీ  కూడా భారత జైళ్లపై ఆరోపణలు చేసి.. తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. భారత జైళ్లలో సదుపాయాలు బాగుండవని.. మానవ హక్కులను ఉల్లంఘిస్తాయని ఆరోపించారు.

దీనిపై సీబీఐ మండిపడింది.. అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా ఇండియాలో జైళ్లు నిర్వహిస్తున్నారని.. రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో ఉన్న మానవ హక్కుల కమిషన్‌లు.. జైళ్లలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లయితే చర్యలు తీసుకుంటాయని తెలిపింది. 

Last Updated 9, Sep 2018, 12:10 PM IST