Sabarimala: శబరిమల ఆలయానికి చేరుకునే భక్తులకు అండగా నిలవాలనీ, వారికి తగిన సౌకర్యాలు కల్పించాలనీ, వాహనాలకు తగిన పార్కింగ్ సౌకర్యాలు కల్పించాలని కేరళ హైకోర్టు అధికారులను ఆదేశించింది. కొండపై రద్దీ అదుపులో ఉండేలా చూడాలని జస్టిస్ అనిల్ నరేంద్రన్, జస్టిస్ జి.గిరీష్ లతో కూడిన ధర్మాసనం రాష్ట్ర పోలీసులను ఆదేశించింది.
Sabarimala Mega Rush, Protest Explained: శబరిమలకు భక్తులు పొటెత్తున్నారు. ఇదే సమయంలో అక్కడి భక్తులు మెగా నిరసన ర్యాలీ చేపట్టారు. దైవ దర్శనానికి వెళ్లిన భక్తులు ఎందుకు నిరసన దిగారు. ఎప్పుడూ లేనంతగా అయ్యప్ప దర్శనానినికి ఒక్కసారిగా భక్తులు రావడానికి కారణాలు ఎమిటి? హైకోర్టు కల్పించుకునే విధంగా పరిస్థితులు ఎందుకు మారాయి? అధికార-ప్రతిపక్షాలు భక్తుల సమస్యలపై కాకుండా రాజకీయ ప్రాధాన్యతనే ముందుకు తీసుకెళ్తున్నాయా? అసలు ఎందుకు శబరిమలలో ప్రస్తుత ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రసిద్ధ హిందూ ఆలయం శబరిమల అయ్యప్ప ఆలయం..
undefined
శబరిమల ఆలయం కేరళలో ఉంది. అయ్యప్ప స్వామి కొలువైన ప్రసిద్ధ హిందూ ఆలయం శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం. ప్రతీ ఏడాది ఇక్కడకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అయ్యప్ప మాలలు ధరించి మొక్కులు చెల్లించుకుంటారు. అయితే, ఈ ఏడాది భారీగా సందర్శకులు వస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఇసుక చల్లితే కింతకు రాలని విధంగా భక్తజనసందోహం నెలకొంది. దర్శనం కోసం వస్తున్న భక్తులకు కనీస సౌకర్యాలు, భద్రతా చర్యలు లేవని యాత్రికులు ఫిర్యాదు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, త్రిస్సూర్, కోజికోడ్, మలప్పురం వంటి ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు భక్తులు ఆలయానికి తమ యాత్రను రద్దు చేసుకుని తిరిగి స్వస్థలానికి తిరిగి వచ్చారని స్థానిక నివేదికలు తెలిపాయి. పోలీసులు వాహనాలను అడ్డుకోవడంతో సందర్శకులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది.
భక్తులు నిరసనల హోరు..
ఆన్ లైన్ మనోరమలో వచ్చిన కథనం ప్రకారం, పంపాలోకి అనుమతించరాదన్న అధికారుల నిర్ణయానికి నిరసనగా శబరిమల యాత్రికులు మంగళవారం ఎరుమేలి వద్ద రహదారిని దిగ్బంధించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు ఎరుమేలి-రన్నీ రహదారిని దిగ్బంధించి తమ నిరసనను తెలియజేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఎట్టుమానూర్ మహాదేవ ఆలయంలో గంటల తరబడి వేచి ఉన్నప్పటికీ శబరిమలకు వెళ్లకుండా యాత్రికులను అడ్డుకోవడంతో భక్తులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అంతకుముందు ఉదయం ఎట్టుమనూర్ ఆలయానికి చేరుకున్న వందలాది మంది భక్తులను ఎరుమేలి, పంపా రద్దీ కారణంగా శబరిమలకు అనుమతించలేదని పేర్కొంది.
''దశాబ్దాల క్రితం మా నాన్నతో కలిసి చిన్నప్పుడు శబరిమలకు వచ్చాను. ఇప్పటికీ, నాకు సుందరమైన మార్గం స్పష్టంగా గుర్తుంది. నేను వృద్ధురాలిని అయిన తరువాత నా కుటుంబంతో కలిసి ఆలయానికి వెళ్ళడం ఇదే మొదటిసారి. పంపా నుంచి సన్నిధానం, శబరిమల వెళ్లే ట్రెక్కింగ్ మార్గం ప్రస్తుత స్థితిని చూడాలని ఆత్రుతగా ఉన్నాను. దురదృష్టవశాత్తూ ఈ రోజు (మంగళవారం) నీలక్కల్ వద్ద మా ప్రయాణాన్ని నిలుపుకోవాల్సి వచ్చింది. నీలక్కల్ వద్ద పరిస్థితి మాలో భయాన్ని నింపింది. మేము ఇప్పుడు పండలం నుండి తిరిగి వస్తున్నాము" అని త్రిసూర్ లోని అరింపూర్ కు చెందిన 60 ఏళ్ల ఓమన అనే యాత్రికులు చెప్పినట్టు న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ నివేదంచింది. పోలీసులు వాహనాలను అడ్డుకోవడంతో ఎరుమేలి నుంచి నీలక్కల్ చేరుకోవడానికి భక్తులకు ఎనిమిది గంటలకు పైగా సమయం పట్టిందని టీఎన్ఐఈ పేర్కొంది. బస్సులన్నీ కిక్కిరిసిపోవడంతో వారు పంపాకు వెళ్లలేకపోయారు.
శబరిమల వివాదంపై కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. 'కొన్నిసార్లు రద్దీ కారణంగా సమస్యలు వస్తున్నాయి. ఇది ప్రధాన దర్శనం సీజన్.. జనవరి 15 వరకు కొనసాగుతుంది... సాధారణంగా వారు (పోలీసు శాఖ) తమ విధులను చక్కగా నిర్వహిస్తారు... జరిగిన సంఘటనకు చాలా బాధగా ఉంది... ప్రజాప్రతినిధులు ఈ అంశాన్ని లేవనెత్తాలని' పేర్కొన్నారు.
శబరిమలపై కేరళ హైకోర్టు జోక్యంతో..
శబరిమల ఆలయానికి చేరుకునే భక్తులకు అండగా నిలవాలని, వాహనాలకు తగిన పార్కింగ్ సౌకర్యాలు కల్పించాలని కేరళ హైకోర్టు అధికారులను ఆదేశించింది. కొండపై రద్దీ అదుపులో ఉండేలా చూడాలని జస్టిస్ అనిల్ నరేంద్రన్, జస్టిస్ జి.గిరీష్ లతో కూడిన ధర్మాసనం రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. క్యూ కాంప్లెక్స్ లో భక్తుల రద్దీని అనుమతించవద్దనీ, ప్రతిరోజూ పరిశుభ్రంగా ఉంచాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. విద్యా సంస్థల్లోని ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల ద్వారా లేదా సంబంధిత స్థానిక స్వపరిపాలన సంస్థల సహాయంతో యాత్రికులకు తాగునీరు, బిస్కెట్లు అందించవచ్చా అనే విషయాన్ని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు పరిశీలిస్తుందని కోర్టు తెలిపింది. వాహనాల గరిష్ట పార్కింగ్ జరిగేలా చూడటానికి దేవస్థానం బోర్డు ప్రతి పార్కింగ్ మైదానంలో తగిన సంఖ్యలో భద్రతా సిబ్బంది / ఉద్యోగులను నియమించాలని హైకోర్టు తెలిపింది. చిన్నారులతో సహా యాత్రికుల కోసం ఆలయంలో మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోర్టు పేర్కొంది.
శబరిమల ఆలయంలో ఎందుకు ఇంత రద్దీ..?
డిసెంబర్ 8 ఉదయం ప్రారంభమైన ట్రాఫిక్ జామ్ నాలుగు రోజుల పాటు పంపా, నీలక్కల్, సన్నిధానంపై ప్రభావం చూపిందని మనోరమ నివేదించింది. తీర్థయాత్ర మొదటి రెండు వారాల్లో, యాత్రికుల రోజువారీ సగటు అర లక్ష. డిసెంబర్ 7వ తేదీ తర్వాత భక్తుల తాకిడి మొదలైందని, రద్దీకి గల కారణాలను నివేదికలో పేర్కొన్నారు. వీటితో పాలు ఇదే ప్రధాన సీజన్ కావడం, వివిధ ప్రాంతాల్లోని పరిస్థితులు కూడా ఆలయ రద్దీని ప్రభావితం చేశాయి. వాటిలో..
చెన్నై వరదలు: చెన్నైలో వరదలు వచ్చినప్పుడు కేరళకు వెళ్లే పలు రైళ్లను రద్దు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పలువురు అయ్యప్ప భక్తుల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఈ భక్తులు తరువాత బుక్ చేసుకుని సన్నిధానానికి వచ్చారు. ఇది కూడా రద్దీ పెరగడానికి కారణంగా ఉంది.
ఎన్నికలు: పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో ఎన్నికలు జరిగినా భక్తుల తీర్థయాత్రలు దెబ్బతినలేదు. తెలంగాణలో పోలింగ్, ఓట్ల లెక్కింపు తర్వాత యాత్రికుల సంఖ్య భారీగా పెరిగింది. ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న వారు ఓటు వేసేందుకు స్వగ్రామానికి వెళ్లి ఉంటారనీ, అక్కడి నుంచి శబరిమలకు వెళ్లాలని ప్లాన్ చేసి ఉంటారని భావిస్తున్నారు. తెలంగాణ నుంచి శబరిమలకు వెళ్తున్న భక్తులు సంఖ్య భారీగానే ఉంది.
ప్రణాళికా లోపం: సన్నిధానం, పంపా, నీలక్కల్లలో పోలీసు వ్యవస్థలు సమన్వయంతో పనిచేయలేకపోయాయని నివేదికలు పేర్కొంటున్నాయి. సన్నిధానానికి వెళ్లే భక్తులను నియంత్రించడం ఎంత ముఖ్యమో, దర్శనం తర్వాత వెళ్లిపోయిన వారిని తిరిగి తీసుకురావడం కూడా అంతే ముఖ్యం. ఒక రోజులో ఎంతమంది దర్శనానికి వస్తారో పోలీసులకు, దేవస్వం బోర్డుకు తెలిసినా ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారని మనోరమ నివేదించింది. బుక్ చేసుకున్న వారితో పాటు ఆలస్యంగా వచ్చిన వారు చేరడంతో పరిస్థితులు మునుపెన్నడూ లేనంతగా మారిపోయాయి.