ఖురాన్‌లో దైవదూషణకు శిక్ష లేదు: పాకిస్థానీ పండితుడు

By Asianet NewsFirst Published Aug 30, 2023, 3:03 PM IST
Highlights

Maulana Ghamidi: పాకిస్థాన్‌తో పాటు కొన్ని దేశాల దైవదూషణ చట్టాలను పాకిస్థాన్‌కు చెందిన మత పండితుడు మౌలానా జావేద్ అహ్మద్ ఖమీదీ విమర్శించారు. ఖురాన్ వివిధ నేరాలకు శిక్షను నిర్దేశిస్తోందని, కానీ, దైవదూషణ సంబంధిచిన శిక్ష గురించి ప్రస్తావించలేదని ఖమీడీ అంటారు. ప్రవక్త కాలంలో కూడా ప్రవక్తపై దూషించిన సంఘటనలు జరిగాయి. కానీ అందుకు ఎలాంటి శిక్ష పడలేదని అన్నారు.  .  

Maulana Ghamidi: పాకిస్థాన్‌లో జన్మించిన మత పండితుడు మౌలానా జావేద్ అహ్మద్ గమిడి తన ప్రత్యేకమైన అభిప్రాయాలు, సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. తరచూ వివాదాల్లో చిక్కుకుంటాడు. ఈ కారణంగా సంకుచిత మనస్తత్వం కలిగిన పాకిస్తాన్ సమాజం అతనిని అంగీకరించలేదు. దీంతో అతడు దేశం విడిచి వెళ్ళవలసి వచ్చింది. ప్రస్తుతం USAలో నివసిస్తున్న మౌలానా ఘమిడి తన స్వదేశంలో (పాకిస్తాన్)సాధ్యం కాని నిజమైన భావప్రకటనా స్వేచ్ఛను అమెరికాలో  అనుభవిస్తూ మీడియా, సోషల్ మీడియా ద్వారా తన స్వేచ్ఛయుత అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అతను పాకిస్తాన్ సమాజం, న్యాయవ్యవస్థ, సైన్యం, మత పండితులను బహిరంగంగానే విమర్శిస్తాడు.

పాకిస్తాన్‌లోని కొన్ని వర్గాల ప్రజలు విజృంభిస్తున్న మత తీవ్రవాదం, ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నారని ఘమిడి ఆరోపించారు. తన దేశ విధ్వంసానికి ఇవే కారణాలని ఆయన భావిస్తున్నారు. పొగురుదేశాలతో పాకిస్తాన్ విధానాలు, ప్రవర్తన శైలిని ఆయన తీవ్రంగా విమర్శించారు. మౌలానా జావేద్ అహ్మద్ ఘమిడి కాశ్మీర్‌లో పాకిస్తాన్ జోక్యం చేసుకోకూడదని, కాశ్మీర్ (J&K) భారత్ కు సంబంధించిన విషయమని, తమ భవిష్యత్తును నిర్ణయించే హక్కు వారికే ఉంటుందని అభిప్రాయపడ్డారు.

కాశ్మీర్ సమస్య పేరుతో భారతదేశంలో ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రోత్సహించకూడదని పాకిస్థాన్ పలుమార్లు హెచ్చరించారు. అలాగే ఆయన ఆఫ్ఘనిస్తాన్‌లో పాకిస్తాన్ జోక్యాన్ని కూడా అంగీకరించలేదు. కాబూల్‌లోని తాలిబాన్ పాలనపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. గత కొద్దిరోజులుగా.. మౌలానా జావేద్ అహ్మద్ గమిడి కూడా ఉగ్రవాదం,తీవ్రవాదం, పాకిస్తాన్‌లో పరిస్థితి, ఇజ్తిహాద్ ఆవశ్యకత వంటి అంశాలపై బహిరంగంగా మాట్లాడుతున్నారు.

ఇటీవల స్వీడన్‌లో పవిత్ర ఖురాన్‌ను తగులబెట్టిన ఘటనపై గామిది మాట్లాడుతూ.. ఇది అల్లా గ్రంథమని అన్నారు. “ ఎవరైనా అభ్యంతరాలను అధిగమించి, మనల్ని బాధించే పని చేస్తే ఓపికగా వేచి ఉండండి.. ఎలాంటి బాధ వచ్చినా ఓపికగా వేచిచూడాలని పవిత్ర ఖురాన్‌ చెబుతోంది. ఇతర మతాలవారికి ఆ గ్రంథంపై ఉన్న సందేహాలను తీర్చడం ముస్లింలమైన మనందరి బాధ్యత. ఖురాన్ సందేశాన్ని ప్రపంచానికి వివరించడంలో ముస్లింలమైన మనం మన శక్తినంతా వెచ్చించామా? దాని ప్రాముఖ్యత ఏమిటి?“ అని ప్రశ్నించారు. 

ప్రవక్త ముహమ్మద్ జీవితం నుండి ఉటంకిస్తూ.. అటువంటి సంఘటనలు ప్రవక్త జీవితకాలంలో జరిగాయని, పునరుత్థాన దినం వరకు జరుగుతూనే ఉంటాయని ఆయన అన్నారు. ఖురాన్‌ను అపహాస్యం చేస్తే వెంటనే అలాంటి సభ నుంచి వెళ్లిపోవాలనేది ఖురాన్‌ బోధ అన్నారు. పాకిస్తాన్, మరికొన్ని దేశాల దైవదూషణ చట్టాలపై ఆయన మాట్లాడుతూ.. దివ్య ఖురాన్‌లో వివిధ నేరాలకు శిక్షను నిర్దేశించారని, అయితే దైవదూషణకు శిక్షను నిర్దేశించలేదని గామిడి అన్నారు. పవిత్ర ఖురాన్ దూషణను ప్రస్తావించలేదనీ, ప్రవక్త కాలంలో కూడా ప్రవక్తను అవమానించిన సంఘటనలు ఉన్నాయనీ, కానీ అలాంటి వారికి ఎలాంటి శిక్ష విధించబడలేదని పేర్కొన్నారు. 

ప్రవక్త నిర్ణయాన్ని పాటించనందుకు హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ ఒక వ్యక్తిని తల నరికి చంపాడని ఒక నమ్మకం ఉందని, ఈ సంఘటనల్లో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు. పాకిస్థాన్‌పై దేశం ఆవిర్భావం నుంచి వివాదాలతో బాధపడుతోందని అన్నారు. ప్రభుత్వ తీరుపై వివాదం నెలకొంది. పాకిస్థాన్‌లోని తీవ్రవాదాన్ని విమర్శిస్తూ.. పాకిస్థాన్ తాలిబాన్ తరహా వ్యవస్థను కోరుకుంటే అది ఆఫ్ఘన్ పాలకులను ఆహ్వానించి చెత్త ప్రభుత్వాన్ని చూడాలని అన్నారు.

ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని మౌలానా జావేద్ గమిడి తీవ్రంగా విమర్శించారు. ఆఫ్ఘన్ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా పాలించే హక్కు తాలిబాన్‌లకు లేదని అన్నారు. ప్రజల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు ఏ ప్రభుత్వానికీ లేదని ఆయన అన్నారు. పాకిస్థాన్‌లో అస్థిరతపై మౌలానా జావేద్ గమిది మాట్లాడుతూ .. పాకిస్థాన్ ద్వంద్వత్వంతో పుట్టిందని అన్నారు.మిలిటరీ,ప్రజాస్వామ్యం మధ్య వివాదంలో ఈ పరిస్తితి నెలకొందని విమర్శించారు.
 
ఆధునిక రాజ్యంలో మతం, కులం లేదా రంగు ఆధారంగా ఎవరిపైనా కూడా వివక్ష చూపలేమని ఆయన పేర్కొన్నారు. పాకిస్థాన్ లో ఒకవైపు ప్రజాస్వామ్యం, మరోవైపు మత రాజ్యం సాగుతోందని అన్నారు. మత రాజ్యంలో ఒక మతానికి చెందిన వ్యక్తులకు మాత్రమే అధికారం ఇవ్వబడుతుంది. సామాన్యులకు ఎటువంటి పాత్ర ఉండదు. ఇతర మతాల వారు రెండవ తరగతి, మూడవ తరగతి పౌరులుగా జీవిస్తారు. షరియాను అనుసరించే ముస్లింల ప్రభుత్వం మూడవ రకం ప్రభుత్వం ఉంటుందని అన్నారు. 

పాకిస్తాన్ భవిష్యత్తు గురించి మౌలానా ఘమిడి మాట్లాడుతూ.. పాకిస్తాన్ తన దుష్ప్రవర్తనకు మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. ప్రజాస్వామ్యం లేదా నియంతృత్వం పనిచేయవనీ, ఈ వివాదం అంతం కాకపోతే.. న్యాయవ్యవస్థ, సైన్యం రాజ్యాంగాన్ని అనుసరించకపోతే.. ఏమీ మారదని అన్నారు. ప్రతి రాజ్యాంగానికి కొన్ని సమస్యలు ఉంటాయనీ, వాటిని గుర్తించి సరిదిద్దుకోవాలని సూచించారు. కానీ ఈ రాజ్యాంగాన్ని సైన్యం ఎప్పుడూ హృదయపూర్వకంగా అంగీకరించలేదనీ, అలాగే.. న్యాయవ్యవస్థ కూడా దీనిని హృదయపూర్వకంగా అంగీకరించలేదని పేర్కొన్నారు.

పాకిస్తాన్‌లో మతపరమైన తీవ్రవాదం, ఉగ్రవాదం గురించిజావేద్ అహ్మద్ గమిడి  మాట్లాడుతూ ఇలా అన్నారు. “మీకు ఒక భావజాలం ఉండి, ఇతరులను ఒప్పించేందుకు హింసాత్మక ప్రవర్తనను అవలంబిస్తే.. అది తీవ్రవాదం. మీరు ఇతరులను అణచివేయాలని కోరుకుంటారు. మీరు తుపాకీతో ఇతరులను ఒప్పించాలనుకుంటున్నారు. అది తీవ్రవాదం. ఈ ఉగ్ర వాదం మరో రూపు దాల్చింది. వివిధ గ్రూపులు సంఘటితమై ఒకరి గొంతులు ఒకరు కోసుకోవడం ప్రారంభించడం వల్లే ఉగ్రవాదం పుట్టుకొచ్చింది. అంటే మనుషుల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి.” అని అన్నారు.

మహిళలు దుపట్టాతో తల కప్పుకోవడం అవసరమా? అనే ప్రశ్నకు జావేద్ అహ్మద్ గమిడి బదులిస్తూ.. వృద్ధులు తమ ఛాతీపై నుంచి దుపట్టా తీయవచ్చని ఖురాన్‌లో చెప్పారని, అయితే దానిని తీయకపోవడమే మంచిదని అన్నారు. మహిళలు పురుషులను ఎదుర్కొనేందుకు వెళుతుంటే.. వారు నగలు ధరించినట్లయితే, వారు దానిని కప్పి ఉంచడం అవసరం. అయితే నగలు వేసుకోని, అలంకారాలు (మేకప్) చేసుకోని వారు దుపట్టా లేకుండా బయటకు వెళ్లవచ్చు .కానీ, తలపై దుపట్టా కప్పుకోవాలి. దుపట్టా మన సంస్కృతిలో భాగమని జావేద్ గమిడి చెప్పారు.

click me!