పాకిస్థాన్ పరిస్థితి రోజురోజుకు మరింత దారుణంగా మారుతోంది. ఆర్థిక సంక్షోభం నుండి బయటపడే మార్గాలులేక తలలు పట్టుకున్న పాక్ పాలకులకు పివోకే లో ఆందోళనలు సవాల్ గా మారాయి. పీవోకే లో ప్రజాగ్రహం కట్టలు తెెంచుకుంది... ఈ క్రమంలోనే భారత్ కు అనుకూల డిమాండ్స్ అక్కడ వినిపిస్తున్నాయి.
మన దాయాది దేశం పాకిస్థాన్ లో పరిస్థితి దారుణంగా తయారయ్యింది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆ దేశ పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారుతోంది. ద్రవ్యోల్బనం కారణంగా అక్కడి ప్రజల కనీస అవసరాల కోసం భారీగా ఖర్చుచేయాల్సి వస్తోంది... దీంతో పేద ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. వేలాది కుటుంబాలు ఆకలిబాధతో అలమటిస్తున్నాయి. దీంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK) లో సరికొత్త నినాదం తెరపైకి వచ్చింది. తమ ప్రాంతాన్ని భారత్ లో కలిపాలంటూ కొన్నిచోట్ల ఆందోళనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
సిఎన్ఎన్-న్యూస్ 18 కథనం ప్రకారం... పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి పివోకే లో ఆందోళనలకు కారణమవుతోంది. ద్రవ్యోల్బనంతో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటిన సమయంలోనే పాక్ ప్రభుత్వం దేశ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రజలపై అధిక ట్యాక్సులు వేస్తోంది. దీంతో ప్రజా తిరుగుబాటు మొదలయ్యింది. ఇలా పివోకే ప్రజలు కూడా తమ కష్టాలను చెప్పుకుంటూ నిరసనలకు దిగితే పాక్ పాలకులు పోలీసులకు ఉపయోగించి చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రజాగ్రహం మరింత పెరిగి ఆందోళనకర పరిస్థితులకు దారితీస్తోంది.
పివోకే పై పట్టు కోల్పోయిన పాక్ ?
పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ప్రజల్లో పాలకులపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. దశాబ్దాలుగా భారత భూభాగాన్ని ఆక్రమించుకుని పాలిస్తోంది పాక్... అంతేకాకుండా ఆ ప్రాంతంలో ముస్లిం జనాభా ఎక్కువ... కాబట్టి పివోకేలో పాక్ కు మంచి పట్టుంది. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయిందట. ఈ విషయం పివోకే ప్రజల ఆందోళనలను బట్టి అర్థమవుతోంది.
పివోకే లో ఆందోళనలను అణచివేసేందుకు స్థానిక పోలీసులే కాదు ఆర్మీని రంగంలోకి దించిన పాక్ ప్రభుత్వం. అయితే పాక్ ప్రభుత్వ తీరుపై విసిగెత్తి వున్న ప్రజలు భద్రతా సిబ్బందిపైనా తిరగబడుతున్నారు. వారి వాహనాలను సైతం ధ్వంసం చేసి దాడులకు దిగుతున్నారు. పివోకే లో జరుగుతున్న ఆందోళన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిని బట్టి పివోకే ప్రజలు పాక్ ప్రభుత్వంపై పట్టరాని కోపంతో వున్నారని తెలుస్తోంది.
భారత్ లో కలుస్తామన్న డిమాండ్ :
పివోకే లో ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులు కొత్త డిమాండ్ కు దారితీస్తున్నాయి. ఇక పాకిస్థాన్ తో కలిసి వుండలేమని... తమను ఇండియాలో కలపాలని పివోకే లోని కొందరు కోరుతున్నారట. అంతేకాదు ఈ డిమాండ్ తో కూడిన పోస్టర్లు కూడా వెలుస్తున్నాయట. ఎప్పుడూ లేనిది పివోకేలోని కొన్నిచోట్ల భారత జాతీయ జెండాలు కనిపిస్తున్నాయి. ఈ డిమాండ్ మరింత పెరగకుండా పివోకేలో ప్రజా ఉద్యమాన్ని అణచివేసేందుకు పాక్ పోలీసులను, ఆర్మీని రంగంలోకి దించింది. అయినా ప్రజా పోరాటం ఆగడంలేదు... భారీగా రోడ్లపైకి వస్తున్న ప్రజలు ప్రభుత్వ ఆస్తులు, భద్రతా బలగాల వాహనాలను ధ్వంసం చేస్తున్నారు. పివోకేలో ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చ్కర్లు కొడుతున్నాయి.