నాసిక్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం.. కెమికల్ ఫ్యాక్టరీలో ఎగసిపడుతున్న మంటలు..

By Sumanth KanukulaFirst Published Jan 1, 2023, 4:36 PM IST
Highlights

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఆదివారం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కెమికల్‌ ప్లాంట్‌లోని బాయిలర్‌ పేలుడు సంభవించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఆదివారం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కెమికల్‌ ప్లాంట్‌లోని బాయిలర్‌ పేలుడు సంభవించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. నాసిక్‌లోని ఇగత్‌పురి తహసీల్‌లోని ముండేగావ్ గ్రామంలో జిందాల్ గ్రూప్‌కు చెందిన పాలిథిన్ తయారీ యూనిట్‌లో ఉదయం 11:30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటన జరిగిన సమయంలో కొందరు కార్మికులు కంపెనీ ఆవరణలో ఉన్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాప సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటన స్థలంలో మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఫ్యాక్టరీ లోపల కొందరు కార్మికులు చిక్కుకుపోయినట్లు సమాచారం.

‘‘కార్మికులు, సూపర్‌వైజర్‌తో సహా మొత్తం 14 మంది గాయపడ్డారు. వారిని సహాయక సిబ్బంది ఆసుపత్రిలో చేర్చారు’’ అని నాసిక్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ షాజీ ఉమాప్ తెలిపారు. ఇక, ఈ ఘటన జరిగిన సమయంలో భారీ పేలుడు శబ్ధం వినిపించడంతో ఆ ప్రాంతంలోని నివాసితులు తీవ్ర భయాందోళన చెందారు. ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయి. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

ఈ ప్రమాదంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్పందించారు. ఘటన స్థలంలో అగ్నిమాపక దళం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టుగా పేర్కొన్నారు. 

click me!