
Dharmasthala Case : కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో వరుస హత్యలు జరిగాయంటూ తప్పుడు ప్రచారం చేసిన మాస్క్ మ్యాన్ అరెస్టయ్యాడు. ఇతడు ఇప్పటివరకు చెప్పిందంతా అబద్దమని తేల్చిన ప్రత్యేక దర్యాప్తు టీమ్ (SIT) ఇవాళ అరెస్ట్ చేసింది. ముసుగు మ్యాన్ గా పిలవబడుతున్న నిందితుడు చిన్నయ్యను బెల్తంగడి కోర్టులో హాజరుపర్చారు… విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలని సిట్ అధికారులు కోరారు. దీంతో 10 రోజులపాటు విచారణ నిమిత్తం సిట్ కస్టడీకి అప్పగించింది న్యాయస్థానం.
ఇవాళ (శనివారం) ఉదయం ముసుగు మనిషి చిన్నయ్యను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 3 వరకు ఇతడు సిట్ కస్టడీలోనే ఉండనున్నారు. విచారణలో ఎలాంటి విషయాలు బయటపడతాయన్నది ఆసక్తికరంగా మారింది.
ధర్మస్థలలో వందలావ శవాలను పూడ్చానని చెప్పిన ముసుగు మనిషి మండ్యకి చెందిన చిన్నయ్యగా తెలుస్తోంది. ఇప్పటివరకు సాక్షి రక్షణ చట్టం కింద అతడి వివరాలను పోలీసులు బైటపెట్టలేదు… కానీ అతడు చెప్పేదంతా అబద్ధమని తేలడంతో అరెస్ట్ చేశారు. దీంతో పాటు ఈ బురుడే గ్యాంగ్‌లోని మరో సభ్యుడు గిరీష్ మట్టన్నవర్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
ధర్మస్థల కేసులో ఫిర్యాదుదారు అయిన సి.ఎన్ చిన్నయ్య అలియాస్ చెన్న ఇప్పుడు నిందితుడిగా మారాడు. ఇప్పటివరకు అతడికి సాక్షి రక్షణ చట్టం కింద భద్రతను ఇచ్చారు… దాాన్ని ఉపసంహరించుకుని అరెస్ట్ చేశారు. మొదట సాక్షిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు నిందితుడిగా మారడం ఈ కేసులో ముఖ్యమైన మలుపుగా చెప్పవచ్చు.
ధర్మస్థల వ్యవహారంలో మాస్క్ మ్యాన్ చిన్నయ్య మృతదేహాలను పాతిపెట్టినట్లుగా చెప్పిన 17 చోట్ల సిట్ అధికారులు తవ్వకాలు జరిపించారు. కానీ ఎక్కడా మృతదేహాలు కాదుకదా అనుమానాస్పదంగా ఏమీ లభించలేదు. అంతేకాదు అతడు చెప్పేదంతా తేడాగా ఉండటంతో పోలీసులు తమదైన స్టైల్లో విచారించారు… దీంతో అసలు నిజం బైటపడింది. చిన్నయ్య అబద్దాలు చెబుతున్నట్లు తేలడంతో సిట్ అధికారులు అతనికి ఇచ్చిన సాక్షి రక్షణను కోర్టు ద్వారా రద్దు చేయించారు. దీని తర్వాత ముసుగు మనిషిని అరెస్ట్ చేసి వివరాలు బయటపెట్టారు.
చిన్నయ్య ఫోటోను ఏసియా నెట్ బయటపెట్టింది. ఈ ఫోటోను చిన్నయ్య ధర్మస్థలలో తీయించుకున్నాడు. జూన్ నుంచి సిట్ వెంట ముసుగుతో తిరుగుతున్నది ఇతనే. 14 ఏళ్ల క్రితం ధర్మస్థలలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నప్పుడు తీయించుకున్న ఫోటో ఇది.