మహారాష్ట్రలో మరాఠా ఉద్యమం హింసాత్మక రూపం తీసుకుంది. సోమవారం ఇద్దరు ఎమ్మెల్యే ఇళ్లు, ఒక మాజీ మంత్రి ఇల్లుకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ప్రభుత్వ ఆస్తులనూ ధ్వంసం చేశారు. బీడ్ జిల్లాలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి.
ముంబయి: మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల పోరాటం తీవ్రతరమైంది. సోమవారం ఈ ఉద్యమం హింసాత్మకంగా మారింది. బీడ్ జిల్లాలో ఆందోళనకారులు పలువురు రాజకీయ నేతల ఇళ్లకు, ప్రభుత్వ ఆస్తులకూ నిప్పు పెట్టారు. ఆందోళనకారులు ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పు పెట్టారు. మరో మాజీ మంత్రి ఇంటికి కూడా నిప్పు పెట్టారు. ఇద్దరు ఎమ్మెల్యేలు ఎన్సీపీ పార్టీకి చెందినవారు. మాజీ మంత్రి మాత్రం ఏక్‌నాథ్ షిండే గ్రూపునకు చెందినవారు.
మరాఠా రిజర్వేషన్ డిమాండ్లను ఉద్ధవ్ ఠాక్రే గ్రూపు సమర్థిస్తున్నది. వెంటనే ప్రభుత్వం రంగంలోకి దిగి రిజర్వేషన్లు ఇచ్చే పని మొదలు పెట్టాలని ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. అంతేకాదు, ప్రత్యేక పార్లమెంటు సమావేశం నిర్వహించి మరాఠా రిజర్వేషన్ డిమాండ్ పై చర్చించాలని అన్నారు.
undefined
శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ కూటమికి చెందిన ఎమ్మెల్యే సందీప్ క్షీరసాగ్ ఇంటిని, ఆయన ఇంటి ప్రాంగణంలో పార్క్ చేసిన వాహనాలను ఆందోళనకారులు తగులబెట్టారు. ఈ ఘటన బీడ్ జిల్లాలో చోటుచేసుకుంది.
బీడ్ జిల్లాలోనే మరో ఎమ్మెల్యే ప్రకాశ్ సోలాంకే ఇంటినీ ఆందోళనకారులు ధ్వంసం చేశారు. సోలాంకే అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ కూటమికి చెందినవారు. కాగా, బీడ్ జిల్లాలోనే మాజీ మంత్రి జైదత్తాజీ క్షీరసాగర్ కార్యాలయాన్ని తగులబెట్టారు. ఆయన ఏక్ నాథ్ షిండే శివసేన కూటమికి చెందినవారు. వడ్గావ్ నింబాల్కర్ గ్రామంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ పోస్టర్లను నాశనం చేశారు.
Also Read: ఎంపీ ప్రభాకర్ రెడ్డికి భద్రతా వైఫల్యం.. ఘటనా సమయంలో పోలీసులు లేరు?
విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం మరాఠా ప్రజలు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. మరాఠా రిజర్వేషన్ ఆందోళనాకుడు మనోజ్ జరాంగే పాటిల్ సారథ్యంలో ఉద్యమం ఊపందుకుంది. ఈ నెల 25వ తేదీ నుంచి ఆయన నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. అంతకుముందు ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 14వ తేదీ వరకు నిరాహార దీక్ష చేశారు. ఈ డిమాండ్‌ను పరిశీలిస్తామని రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇవ్వడంతో దీక్షను విరమించారు. కానీ, అటు వైపుగా అడుగులు పడకపోవడంతో మరోసారి ఆయన నిరాహార దీక్షకు దిగారు.