
Operation Kagar : మావోయిస్టులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఒక సంచలన లేఖ రాశారు. ఆ లేఖలో, తక్షణమే ఆపరేషన్ కాగర్ నిలిపివేసి, ఎన్‌కౌంటర్లను ఆపితే ఆయుధాలను వదిలేస్తామని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ ప్రకటనను సీపీఐ మావోయిస్టుల అధికార ప్రతినిధి అభయ్ పేరిట విడుదల చేశారు. కాగా, 2026 మార్చిలోపు భారత్ లో మావోయిస్టులను లేకుండా చేస్తామని హోంమంత్రి అమిత్ షా పలు మార్లు ప్రకటించారు. దానిలో భాగంగానే ఆపరేషన్ కాగర్ ను కొనసాగిస్తున్నారు.
ఇదిలావుండగా, ఝార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో సోమవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. మృతుల్లో నిషేధిత సీపీఐ(మావోయిస్టు) పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సహ్‌దేవ్ సోరెన్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇతనిపై రూ.కోటి రివార్డు ఉందని పేర్కొన్నారు.
ఆపరేషన్ కాగర్.. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ గా కూడా గుర్తింపు పొందింది. 2024లో భారత ప్రభుత్వం ప్రారంభించిన భారీ స్థాయి సైనిక, కౌంటర్ ఇన్‌సర్జెన్సీ ఆపరేషన్. దీని ప్రధాన ఉద్దేశ్యం మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించడం, వారి నెట్‌వర్క్‌ను ధ్వంసం చేయడం, 2026 మార్చి నాటికి మావోయిస్టు సిద్ధాంతాన్ని పూర్తిగా తొలగించడం. ఈ ఆపరేషన్‌లో 1 లక్షకు పైగా సీఆర్పీఎఫ్, కోబ్రా యూనిట్లు, జిల్లా రిజర్వ్ గార్డులు, రాష్ట్ర పోలీస్ దళాలు పనిచేస్తున్నాయి. డ్రోన్లు, ఉపగ్రహ చిత్రాలు, కృత్రిమ మేధస్సు వంటి ఆధునిక సాంకేతికతను కూడా ఉపయోగిస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టలులో జరిగిన ప్రధాన దాడుల్లో 30 మంది మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో అగ్రకమాండర్లు కూడా ఉన్నారు. 2025లో ఒక్క ఛత్తీస్‌గఢ్‌లో 140 మందికి పైగా మావోయిస్టులు మరణించారని నివేదికలు చెబుతున్నాయి. ఈ ఆపరేషన్ వల్ల మావోయిస్టు దళాలు బలహీనమవుతున్నప్పటికీ, గిరిజన ప్రాంతాల్లో ప్రజలు తీవ్రంగా ప్రభావితమవుతున్నారని, మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలు ఉన్నాయని పలు వర్గాలు చెబుతున్నాయి.
1967లో ప్రారంభమైన మావోయిస్టు ఉద్యమం దేశంలో ఐదారుదశాబ్దాలుగా కొనసాగుతోంది. ప్రధానంగా మధ్య, తూర్పు భారత రాష్ట్రాలను ప్రభావితం చేస్తోంది. ఆపరేషన్ కాగర్ ద్వారా ఈ ఉద్యమాన్ని ఒకసారి కొలిక్కి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2026 మార్చి నాటికి భారత్‌ను "మావోయిస్టు రహిత దేశంగా" మార్చడమే తుదిలక్ష్యమని అధికారులు చెబుతున్నారు.