హిడ్మా సేఫ్‌గానే ఉన్నాడు.. ఆ వార్తల్లో నిజం లేదు: లేఖ విడుదల చేసిన మావోయిస్టులు..

Published : Jan 12, 2023, 12:31 PM IST
హిడ్మా సేఫ్‌గానే ఉన్నాడు.. ఆ వార్తల్లో నిజం లేదు: లేఖ విడుదల చేసిన మావోయిస్టులు..

సారాంశం

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత మద్వి హిడ్మా మృతి చెందలేదని లేఖలో తెలిపారు. 

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత మద్వి హిడ్మా మృతి చెందలేదని లేఖలో తెలిపారు. మావోయిస్టు దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి పేరుతో ఈ లేఖ విడుదలైంది. హిడ్మా చనిపోయినట్టుగా వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. హిడ్మా సేఫ్‌గానే ఉన్నట్టుగా చెప్పారు. దక్షిణ బస్తర్ జంగిల్ కొండలపై పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలు.. డ్రోన్‌లు, హెలికాప్టర్ ద్వారా దాడులు చేశాయని ఆరోపించారు. 

గత ఏడాది ఏప్రిల్‌లో కూడా వైమానిక బాంబు దాడి జరిగిందని అన్నారు. తమని దెబ్బతీయాలని బాంబులు పేల్చారని ఆరోపించారు. వచ్చే ఎన్నికలలోపు మావోయిస్టులను ఏరివేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారని.. అందులో భాగంగానే దాడులు జరుగుతున్నాయని, ఈ ప్రకటనలు వెలువడుతున్నాయని చెప్పారు. పాలకులకు వ్యతిరేకంగా ప్రగతిశీల కూటములు ఏకమవ్వాలని అని పిలుపునిచ్చారు. 

ఇదిలా ఉంటే.. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత మద్వి హిడ్మా మృతిచెందినట్టుగా వార్తలు వచ్చాయి. హిడ్మా మరణాన్ని పోలీసులు ఇంకా ధృవీకరించనప్పటికీ.. సీఆర్‌పీఎఫ్ కోబ్రా బెటాలియన్ సిబ్బంది మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆపరేషన్‌లు చేపడుతున్నట్లుగా ఛత్తీస్‌గఢ్ సెక్టార్ ఐజీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. 

మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యునిగా ఉన్న హిడ్మా.. గెరిల్లా కార్యకలాపాలలో నిపుణుడిగా పేరుపొందారు. 1996లో మావోయిస్టులలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. అతనిపై రూ. 45 లక్షల రివార్డు ఉంది. 2021 ఏప్రిల్‌లో 22 మంది భద్రతా సిబ్బందిని చంపిన దాడిలో హిడ్మా ప్రధాన నిందితుడు. బీజాపూర్, సుక్మా ప్రాంతాలలో భద్రతా బలగాలపై అనేక ఇతర దాడుల్లో అతను అనుమానితుడిగా ఉన్నాడు. 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం