ఘోరం.. ఉబర్ మహిళా డ్రైవర్‌పై బీరు సీసాలతో దాడి.. ఢిల్లీలో ఘటన

By team teluguFirst Published Jan 12, 2023, 12:15 PM IST
Highlights

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఉబెర్ మహిళా డ్రైవర్ ఇద్దరు వ్యక్తులు బీరు సీసాలతో దాడి చేశారు. ఆమె నుంచి డబ్బు లాక్కున్నారు. ఈ ఘటనలో ఆమె శరీరానికి, మెడకు తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు ఈ ఘటనను సుమోటాగా తీసుకున్నారు. 

దేశ వ్యాప్తంగా మహిళలపై దాడులు ఆగడం లేదు. వారిపై రోజు రోజుకు నేరాలు పెరుగుతున్నాయి. దేశ రాజధానిలోనే మహిళలకు రక్షణ లేకుండా పోతున్నాయి. తాజాగా ఉబెర్ మహిళ డ్రైవర్ పై ఇద్దరు వ్యక్తులు బీరు సీసాలతో దాడి చేశారు. కారును రాళ్లతో ధ్వంసం చేశారు. అనంతరం దోపిడి చేసుకొని వెళ్లిపోయారు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఢిల్లీలోని కశ్మీర్ గేట్‌లోని అంతర్ రాష్ట్ర బస్ టెర్మినస్ సమీపంలో ఇది చోటు చేసుకుంది. 

బాధితురాలిని ఢిల్లీలోని సమయ్‌పూర్ బద్లీ నివాసి ప్రియాంకగా గుర్తించారు.  ఆమె ఉబర్ కార్ డ్రైవర్ గా పని చేస్తోంది. ఆజ్ తక్, ఇండియా టుడే వెల్లడించిన నివేదికల ప్రకారం.. ప్రియాంక జనవరి 9న కస్టమర్ నుంచి కాల్స్ రావడంతో ఐఎస్ బీటీ వైపు వెళ్తోంది. దట్టమైన పొగమంచు ఉండటంతో కార్ నెమ్మదిగా డ్రైవ్ చేస్తోంది. ఆమె కస్టమర్‌కు 100 మీటర్ల దూరంలో ఉండగానే ఇద్దరు వ్యక్తులు కారు ముందుకు వచ్చారు. రాళ్లతో అద్దాలు పగులగొట్టారు. గాజు ముక్కలు, రాళ్లు తగలడంతో ఆమె తలకు, శరీరానికి గాయాలు అయ్యాయి.

ఏం జరిగిందో చూసేందుకు ఆమె కారు దిగింది. దీంతో ఇద్దరు వ్యక్తులు ఆమెను దూషించారు. ఆమె వద్ద ఉన్న డబ్బును లాక్కున్నారు. నిందితుల్లో ఒకరు ఆమె చేయి పట్టుకోగా, మరొకరు ఆమె మొబైల్ లాక్కున్నారు. కానీ ప్రియాంక ధైర్యం చేసి వారి దగ్గర నుంచి ఫోన్ లాక్కుంది. ఇద్దరు వ్యక్తులు తన కారు కీ తీసుకొని, లాక్కునేందుకు ప్రయత్నించారని ప్రియాంక ఆరోపించింది.

‘‘కారు నాది కాదని నేను వారికి చెప్పాను. నేను బిగ్గరగా అరవడం ప్రారంభించడంతో వారిలో ఒకరు బీర్ బాటిల్‌తో నాపై దాడి చేశారు. నా మెడ, ఛాతీపై గాయాలయ్యాయి’’ అని ప్రియాంక తెలిపింది. తన మెడ, శరీరానికి 10 కుట్లు పడ్డాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఉబర్‌లోని ఎమర్జెన్సీ నంబర్‌ను సంప్రదించడానికి ప్రయత్నించానని, అందుబాటులో ఉన్న పానిక్ బటన్‌ను కూడా చాలా సేపు నొక్కినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని ఆమె పేర్కొంది.

చాలా వాహనాలను రోడ్డుపై ఆపేందుకు ప్రయత్నించినా.. ఎవరూ రక్షించలేదని ప్రియాంక ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగిన అరగంట తర్వాత పోలీసులు వచ్చారని చెప్పారు. ‘‘రక్తస్రావం జరగకుండా ఉండటానికి నేను నా గొంతును ఒక గుడ్డతో నొక్కి పెట్టుకున్నాను. పోలీసులు వచ్చిన తర్వాత వారు నన్ను పీఆర్‌సీ వ్యాన్‌లో కూర్చోబెట్టి ఆసుపత్రికి తరలించారు’’ అని అన్నారు. మరుసటి రోజు ఉదయం 6 గంటల సమయంలో అంబులెన్స్ సర్వీస్ నుండి కాల్ వచ్చింది, మీకు అంబులెన్స్ సౌకర్యం అవసరమా అని ప్రశ్నించారని తెలిపింది. ‘‘తరువాత నా కుటుంబ సభ్యులు నన్ను ఇంటికి తీసుకువచ్చారు. ఆ సమయంలో నేను స్పృహలో లేనందున, నేను ఫిర్యాదు చేయలేదు’’ అని ఆమె చెప్పారు.

జనవరి 10 తెల్లవారుజామున 2 గంటల సమయంలో తమకు కాల్ వచ్చిందని, దోపిడీ యత్నం గురించి తమకు సమాచారం వచ్చిందని కశ్మీరు గేట్ పోలీసులు మీడియాతో తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న సమయంలో ప్రియాంక మెడ నుంచి రక్తం కారుతున్నట్లు గుర్తించామని చెప్పారు. అయితే ఆ సమయంలో ప్రియాంక ఫిర్యాదు చేయడానికి నిరాకరించిందని పోలీసులు తెలిపారు. అయితే ఈ కేసును సుమోటోగా తీసుకున్న కాశ్మీర్ గేట్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 393 (దోపిడీకి ప్రయత్నించడం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తదుపరి దర్యాప్తు జరుగుతోంది.

click me!