ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి..

By Sumanth KanukulaFirst Published Jan 12, 2023, 11:48 AM IST
Highlights

హర్యానాలోని పానిపట్‌ జిల్లాలో గురువారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వంటగ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగా ఇంట్లో మంటలు చెలరేగడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

హర్యానాలోని పానిపట్‌ జిల్లాలో గురువారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వంటగ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగా ఇంట్లో మంటలు చెలరేగడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. పానిపట్ జిల్లా బిచ్‌పరి గ్రామ సమీపంలోని తహసీల్ క్యాంపు ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ‘‘ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. మృతుల్లో దంపతులు, వారి పిల్లలు కూడా ఉన్నారు’’ అని పానిపట్‌లోని తహసీల్ క్యాంప్ పోలీస్ స్టేషన్‌లోని ఎస్‌హెచ్‌ఓ ఇన్‌స్పెక్టర్ ఫూల్ కుమార్ తెలిపారు. 

బాధిత కుటుంబం పశ్చిమ బెంగాల్ నుంచి వలస వచ్చిందని పోలీసులు చెప్పారు. ప్రస్తుతం మంటలు చెలరేగిన ఇంట్లో వారు అద్దెకు ఉండేవారు. దంపతులు పానిపట్‌లోని ఓ ఫ్యాక్టరీలో పనిచేసేవారు. ఈరోజు ఉదయం సిలిండర్ లీక్ కావడంతో ఇంట్లో మంటలు చెలరేగాయి. ఇంట్లో నుంచి పేలుడు శబ్దం, పొగలు రావడాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.

అయితే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకునేలోపు ఇంట్లోని ఆరుగురు సజీవ దహనం అయ్యారు. అయితే ఘటన స్థలంలో మంటలను అదుపు చేసిన సిబ్బంది.. మృతదేహాలను పోస్టుమార్టమ్‌ కోసం ఆస్పత్రికి తరలించారు.  మృతుల్లో అబ్దుల్ (45), అతని 40 ఏళ్ల భార్య‌తో పాటు నలుగురు చిన్నారులు ఉన్నారు. 
 

click me!