
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు షాక్ మీద షాక్ తగిలింది. ఏడాది లోపల కేంద్ర సంస్థల చేతిలో డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా రూపంలో రెండో ఆప్ మంత్రి అరెస్టయ్యారు. నిరుడు మే నెలలో సిసోడియా సహచర మంత్రి సత్యేంద్ర జైన్ ను ఈడి అరెస్టు చేసింది. సత్యేంద్ర జైన్ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ మంత్రి వర్గంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు.
తమను వేధించడానికి బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)ని, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి)ని వాడుకుంటోందని ఆప్ విమర్శిస్తోంది. ఎనిమిది గంటల పాటు విచారించిన తర్వాత సిబిఐ మనీష్ సిసోడియాను ఆదివారం సాయంత్రం అరెస్టు చేసింది.మనీ లాండరింగ్ కేసులో ఈడి సత్యేంద్రజైన్ ను అరెస్టు చేసింది. కోల్ కతాకు చెందిన సంస్థతో 2015-16లో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం హవాలా లావాదేవీలు నడిపినట్లు ఈడి ఆరోపించింది.
మనీష్ సిసోడియాను సిబిఐ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు చేసింది. ఢిల్లీ మద్యం విధాన రూపకల్పనలో సిసోడియాతో పాటు మరికొంత మందిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. దానిపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా నిరుడు సిబిఐ విచారణకు ఆదేశించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సిబిఐ ఇప్పటికే మరికొంత మందిని అరెస్టు చేసింది. వారిలో ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి కూడా ఉన్నాడు.