
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆప్ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఆదివారం 8 గంటల పాటు ప్రశ్నించింది. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. సిసోడియా అరెస్ట్ నేపథ్యంలో ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే ఆ ప్రాంతంలో 144 సెక్షన్ ఏర్పాటు చేశారు.
ఇకపోతే.. ఢిల్లీ కేబినెట్‌లో ఫైనాన్స్ పోర్ట్‌ఫోలియో బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న మనీష్ సిసోడియా గత ఆదివారం సీబీఐ నుంచి సమన్లు అందుకున్నారు. అయితే తాను ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ రూపొందించడంలో బిజీగా ఉన్నానని, కాబట్టి విచారణను వాయిదా వేయాలని ఆయన కోరారు. దీంతో ఫిబ్రవరి 26వ తేదీన విచారణకు రావాలని సీబీఐ కోరింది.
ALso Read: నెలల పాటు జైల్లో ఉండాల్సి వచ్చినా పట్టించుకోను.. సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తా - మనీష్ సిసోడియా
అయితే మనీష్ సిసోడియాకు మద్దతు తెలుపుతూ.. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ‘‘లక్షలాది మంది పిల్లలు, వారి తల్లిదండ్రుల ఆశీస్సులు మీ వెంట ఉన్నాయి. దేశం కోసం, సమాజం కోసం జైలుకు వెళ్లడం శాపం కాదు. అది ఒక మహిమ. మీరు త్వరగా జైలు నుంచి తిరిగి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. పిల్లలు, తల్లిదండ్రులు, మేమందరం మీ కోసం ఎదురు చూస్తున్నాం.’’ అని పేర్కొన్నారు.
అయితే సీబీఐ విచారణకు వెళ్లే ముందు ఆయన ఓ ట్వీట్ చేస్తూ.. తాను కొన్ని నెలల పాటు జైలులో ఉండవలసి వచ్చినా పట్టించుకోనని అన్నారు. తాను ఈ రోజు మళ్లీ సీబీఐ అధికారుల దగ్గరికి వెళ్తానని, విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. దేశం కోసం ఉరి శిక్షకు గురైన స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్‌కు తాను అనుచరుడినని అన్నారు.
“ఈరోజు మళ్లీ సీబీఐకి వెళితే మొత్తం విచారణకు పూర్తిగా సహకరిస్తా. లక్షలాది మంది పిల్లల ప్రేమ, కోట్లాది మంది దేశప్రజల ఆశీస్సులు మా వెంట ఉన్నాయి. కొన్ని నెలలు జైల్లో ఉండాల్సి వచ్చినా పట్టించుకోవడం లేదు. అతను భగత్ సింగ్ అనుచరుడిని. దేశం కోసం భగత్ సింగ్‌ను ఉరితీశారు. ఇలాంటి తప్పుడు ఆరోపణల వల్ల జైలుకు వెళ్లడం చిన్న విషయం’’ అని సిసోడియా హిందీలో ట్వీట్ చేశారు.