
దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా (Manish Sisodia) మరోసారి ఎదురుదెబ్బ తలిగింది. జ్యుడీషియల్ కస్టడీని మరోసారి పొడిగిస్తూ రోస్ అవెన్యూ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ కేసులో మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 27 వరకు, ఈడీ కేసులో ఏప్రిల్ 29 వరకు రోస్ అవెన్యూ కోర్టు పొడిగించింది.
ఈ నెలాఖరులోగా ఛార్జిషీటు (ప్రాసిక్యూషన్ ఫిర్యాదు) దాఖలు చేయబోతున్నట్లు ఇడి తరపు న్యాయవాది చేసిన పిటిషన్ కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అలాగే.. మనీష్ సిసోడియాతో పాటు ఎక్సైజ్ కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లై, అమన్‌దీప్ ధాల్‌ల జ్యుడీషియల్ కస్టడీని కూడా పొడిగించారు. ఈడీ నమోదు చేసిన కేసులో అరుణ్ పిళ్లై, అమన్‌దీప్ ధాల్‌ల జ్యుడీషియల్ కస్టడీని రోస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 29 వరకు పొడిగించింది.
సిసోడియా అరెస్టు
మద్యం కుంభకోణం కేసులో సీబీఐ ఫిబ్రవరి నెలలో సిసోడియాను అరెస్ట్ చేసింది. ఈ విషయంలో దాదాపు ఎనిమిది గంటల పాటు విచారించిన తర్వాత ఫిబ్రవరి 26న ఆప్ నేత మనీష్ సిసోడియాను అరెస్టు చేశారు. అతని సమాధానాలు సంతృప్తికరంగా లేవని, విచారణకు ఆయన సహరించడం లేదని అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ అంతకుముందు రోజు దాదాపు తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది.
ఇదిలాఉంటే.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కూడా ఈ కేసులో సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆయనను విచారణ సంస్థ తొమ్మిది గంటల పాటు సుదీర్ఘంగా విచారించింది. సీబీఐ విచారణ అనంతరం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం మాట్లాడుతూ.. ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ తనను 56 ప్రశ్నలు అడిగానని, వాటన్నింటికీ తాను సమాధానమిచ్చానని చెప్పారు. ఎక్సైజ్ పాలసీ వ్యవహారం అంతా ఫేక్ అని కేజ్రీవాల్ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతికి పాల్పడిందని అనడానికి ఎలాంటి ఆధారాలు లేవనీ, ఇది నీచ రాజకీయాల ఫలితమని అన్నారు.