
Manipur women assault case: మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో ఆన్ లైన్ లో ప్రత్యక్షమైన ఘటనలో ఏడో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని సోమవారం తౌబాల్ జిల్లాలో అరెస్టు చేశారు. ఇద్దరు మహిళల వీడియోపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మణిపూర్ లోని ఒక వర్గానికి చెందిన వ్యక్తుల గుంపు.. పొలంలో ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో వారిని లైంగికంగా వేధిస్తూ.. నగ్నంగా ఊరేగించిన వీడియోలు వైరల్ కావడంతో ప్రభుత్వం తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్ర రాజధాని ఇంఫాల్ కు 35 కిలోమీటర్ల దూరంలోని కాంగ్పోక్పి జిల్లాలో మే 4న ఈ ఘటన జరిగిందని ఇండిజెనియస్ ట్రైబల్ లీడర్స్ ఫోరం (ఐటీఎల్ఎఫ్) ఆరోపించింది. అయితే ఈ ఘటన కాంగ్పోక్పీలో ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ వేరే జిల్లాలో జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన 20 సెకన్ల వీడియో ఆన్లైన్లో ప్రత్యక్షమైన మరుసటి రోజే జూలై 26 గురువారం పోలీసులు మొదటి అరెస్టు చేశారు. ఆ తర్వాత మరో ముగ్గురిని అరెస్టు చేశారు. శనివారం అరెస్టయిన ఐదో నిందితుడు 19 ఏళ్ల యువకుడు కాగా, అదుపులోకి తీసుకున్న ఆరో వ్యక్తి మైనర్ అని పోలీసులు తెలిపారు.
షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) హోదా కోసం మైతీ కమ్యూనిటీ డిమాండ్ చేసిన మరుసటి రోజే మణిపూర్ లోని మైతీ-కుకీ తెగల మధ్య హింస చెలరేగింది. ఆ తర్వాత రోజే ఈ దారుణం జరిగింది. ఈశాన్య రాష్ట్రంలో చెలరేగిన హింసాకాండలో ఇప్పటివరకు 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మణిపూర్ లో చెలరేగిన వివాదం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కార్యకలాపాలను కుదిపేసింది. రాష్ట్రంలో జాతి ఘర్షణలపై చర్చకు ప్రభుత్వం అనుమతించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీల బృందం పార్లమెంట్ హౌస్ లోని మహాత్మాగాంధీ విగ్రహం ముందు ధర్నాకు దిగింది. వర్షాకాల సమావేశాలు గురువారం ప్రారంభమైనప్పటి నుంచి మణిపూర్ అంశంపై ఎలాంటి కాలపరిమితి లేకుండా స్వేచ్ఛాయుత చర్చ జరగాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.
"ప్రధాని నరేంద్ర మోడీ సభకు వచ్చి ప్రకటన చేయాలనేది మా డిమాండ్. ఆ ప్రకటనపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నాము. మీరు బయట మాట్లాడుతున్నారు కానీ లోపల మాట్లాడటం లేదు, ఇది పార్లమెంటును అవమానించడమే. ఇది తీవ్రమైన అంశమని" రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రతిపక్షాల ఆరోపణలపై స్పందించిన బీజేపీ మణిపూర్ పై చర్చను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయనీ, ఇతర రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న హింసపై మౌనం వహిస్తున్నారని విమర్శించారు. అయితే, మొత్తంగా దేశంలో మహిళలపై దారుణాలు జరుగుతున్న తీరుపై నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై ప్రజలన నుంచి ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఇలాంటి ఘటనలను సైతం రాజకీయం చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.