
మణిపూర్ లో బీజేపీ విజయం దిశగా దూసుకుపోతోంది. ప్రస్తుతం వరకు 21 స్థానాల్లో గెలుపొందగా.. మరో 11 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. దీంతో ఈ సారి కూడా ఈశాన్య రాష్ట్రంలో కాషాయ జెండా రెపరెపలాడనుంది. బీజేపీ అభ్యర్థి సీఎం కుర్చీని అధిరోహించనున్నారు. అయితే మళ్లీ మణిపూర్ లో బీజేపీ అధికారం చేపట్టడానికి కారణాలు చాలా ఉన్నాయి. వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
శాంతి, స్థిరత్వం
ఓక్రమ్ ఇబోబి సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో బంద్‌లు, దిగ్బంధనాలు, ఆందోళనలు వంటి గందరగోళ పరిస్థితులు అధికంగా ఉండేవి. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక మణిపూర్ లో చాలా ప్రశాంతత నెలకొంది. గతంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పౌర సంస్థలు రాష్ట్రవ్యాప్త బంద్‌లు, ఆర్థిక దిగ్బంధనాలకు పిలుపునిచ్చేవి. ఇవి రోజుల తరబడి కొనసాగేవి. (అతి సుదీర్ఘంగా 2011లో 100 రోజుల ఆర్థిక దిగ్బంధనం కొనసాగింది.) అయితే గతంలో పోలిస్తే ఇప్పుడు హింసాత్మక నిరసనలు, రాళ్లదాడి, బాష్పవాయువు ప్రయోగాలు, కర్ఫ్యూలు లేవు. ఈ పరిస్థితి 2017 కంటే ముందే మెరుగుపడటం ప్రారంభించినప్పటికీ అదే సమయంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ పరివర్తనను బీజేపీ అనుకూలంగా మార్చుకోగలిగింది.
కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ఉండటం..
ఈశాన్య ప్రాంతంలోని ఇతర చిన్న రాష్ట్రాల మాదిరిగానే మణిపూర్ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఓటు వేయడానికి మొగ్గు చూపుతుంటుంది. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. దీంతో మణిపూర్ ఓటర్లు బీజేపీ మంచి సుక్షితమైన ఎంపికగా మారింది. ఈ విషయాన్ని బీజేపీ కూడా ప్రముఖంగా ప్రచారం చేసుకుంది.
బలహీనమైన ప్రతిపక్షం
2017లో మణిపూర్ లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడంలో విఫలం అయ్యింది. ఆ ఎన్నికల సమయంలో 27 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందగా.. ప్రస్తుతం ఆ పార్టీకి 13 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. వారంతా అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీ బలహీన పడింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కు ఉన్న పరిస్థితే మణిపూర్ లోనూ ఉంది. బలమైన కాంగ్రెస్ నాయకులు లేకుండానే ఈ ఎన్నికల్లో రంగంలోకి దిగింది. అయితే కాంగ్రెస్ కు బలమైన నాయకుడు అయిన ఓక్రమ్ ఇబోబి సింగ్ గత రెండు నెలల్లో ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. అయితే గత ఐదేళ్లలో ఆయన ప్రతిపక్షహోదాలో గట్టిగా పోరాడలేదు.
ప్రతిపక్షాలకు కనిపించని ప్రధాన సమస్యలు..
2017లో బంద్‌లు, దిగ్బంధనాలు, కొండ, లోయ ప్రాంతాల్లో నిరసనలు ఉండేవి. అయితే గత ఐదేళ్లలో ఇలాంటి సమస్యలు పెద్దగా ఎదురుకాలేదు. 2017కి ముందు మైటీస్ లేవనెత్తిన ఇన్నర్ లైన్ పర్మిట్ డిమాండ్, 2015లో మూడు వివాదాస్పద “గిరిజన వ్యతిరేక” బిల్లులను తీసుకురావడానికి అప్పటి ప్రభుత్వం ప్రయత్నించింది. దీంతో పాటు కొండ ప్రాంతాలలో ఏడు కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలనుకోవడం అప్పట్లో ఉద్రిక్తతకు కారమైంది. అయితే బీజేపీ 2017 ఎన్నికల సమయంలో వీటిని ప్రధాన ప్రచార అస్త్రాలుగా ఉపయోగించుకుంది. అయితే బీజేపీ తన హయాంలో అలాంటి వివాదాలు సృష్టించే అంశాలను తాకలేదు. దీంతో ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని ఎత్తిచూపే ప్రధాన అంశం లేకుండాపోయింది. ఇది బీజేపీకి అనుకూలంగా పని చేసింది.
వీటితో పాటు బీజేపీ చేపట్టిన గో టు హిల్స్, హిల్ లీడర్స్ డే వంటి అనేక కార్యక్రమాలను ప్రజల ఆదరణను చొరగొన్నాయి. ఇవి మెయిటీలకు గిరిజన కు మధ్య ఉన్న అంతర్యాన్ని తగ్గించేందకు ప్రయత్నం చేశాయి. ఇవి కొంత సత్ఫలితాలను ఇచ్చాయి. అందుకే కొండ ప్రాంతాల్లో 2017లో బీజేపీ 20 స్థానాల్లో బీజేపీ కేవలం ఒక స్థానాన్ని మాత్రమే కైవసం చేసుకున్నప్పటికీ..ఈ ఎన్నికల్లో మాత్రం చెప్పుకోదగ్గ మెరుగుదల కనిపిస్తోంది. హెంగ్లెప్, చందేల్ వంటి హిల్ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.