Punjab Election Results 2022: కమెడియన్ నుంచి సీఎంగా.. భగవంత్ మన్ ప్రయాణం ఇలా

Published : Mar 10, 2022, 06:24 PM ISTUpdated : Mar 10, 2022, 06:44 PM IST
Punjab Election Results 2022: కమెడియన్ నుంచి సీఎంగా.. భగవంత్ మన్ ప్రయాణం ఇలా

సారాంశం

పంజాబ్ అసెంబ్లీ ఫలితాల్లో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా వెళ్లుతున్నది. సీఎంగా భగవంత్ మన్ ప్రమాణం చేయడం దాదాపుగా ఖరారైంది. ఈ నేపథ్యంలోనే భగవంత్ మన్ జీవిత ప్రయాణంపై పలువురు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు కారణం ఆయన తన కెరీర్‌ను స్టాండప్ కమెడియన్‌గా ప్రారంభించడమే. కమెడియన్‌గా మొదలైన ఆయన ప్రస్థానం సీఎం కుర్చీ అధిరోహించే వరకూ సాగింది.  

న్యూఢిల్లీ: జీవిత ప్రయాణం అనూహ్యంగా సాగుతుంటుంది. కొందరిదైతే అసలు ఊహకు చిక్కకుండా నమ్మశక్యం కానట్టుగానే ఉంటుంది. ఈ కోవలోకే భగవంత్ మన్ జీవితం వస్తుంది. ఆయన తన కెరీర్‌ను స్టాండప్ కమెడియన్‌గా ప్రారంభించారు. తాగుబోతుగా పేరేసుకున్నాడు. కమెడియన్‌గా స్టార్‌డమ్ అనుభవిస్తున్నప్పుడు పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. పార్లమెంటుకు ఎన్నికయ్యాడు. లోక్‌సభకూ ఒక్కోసారి మత్తులో తూగుతూ వెళ్లేవాడని సహ చట్టసభ్యులు ఆరోపణలు చేసేవారు. అంతేనా.. ఈ మత్తులోలకుడికి భగవంత్ మన్‌కు బదులు పెగ్‌వంత్ మన్‌గానూ పేరు పెట్టారు. అలాంటి వ్యక్తి మద్యం వదిలి వ్యక్తిగత జీవితం, విలాసాలను పక్కనపెట్టి ప్రజా జీవితానికి అంకితం కావాలని ఫిక్స్ అయ్యారు. ఆప్‌ ఆయనను చేరదీసింది. ఇప్పుడు ఆయన పంజాబ్ సీఎం కుర్చీనే అధిరోహించనున్నారు. క్లుప్తంగా ఇదీ భగవంత్ మన్ ప్రస్థానం.

45 ఏళ్ల భగవంత్ మన్ అసలు రాజకీయ పరిజ్ఞానం పెద్దగా లేకున్నా.. కేవలం 11 ఏళ్లలో సీఎం కుర్చీని అధిరోహించే వరకు ప్రయాణించారు. సంగ్రూర్‌లోని సతోజ్ గ్రామంలో ఓ స్కూల్ టీచర్ ఇంట భగవంత్ మన్ జన్మించారు. ఆయన బీకాం చదువుతున్నప్పుడే కమెడియన్‌గా మారడానికి ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాడు. ఆయన సామాజిక, రాజకీయ అంశాలపై సెటైర్లు వేయడంలో సిద్ధహస్తుడు. ఆయన తన ప్రయత్నాలు ప్రారంభించిన స్వల్ప కాలంలో రాష్ట్రంలో కామెడీ కింగ్ మారిపోయారు. జుగ్ను మస్త్ మస్త్ వంటి అనేక టెలివిజన్ షోస్‌లో ఆయన ప్రోగ్రామ్స్‌ వచ్చేవి. కమెడియన్‌గా ఆయన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్‌కు ఐదుసార్లు సీఎంగా చేసిన ప్రకాశ్ బాదల్ బంధువు క్లీన్ పాలిటిక్స్ కోసం ప్రయోగం చేస్తామని పీపుల్స్ పార్టీ ఆఫ్ పంజాబ్ అనే పార్టీని నెలకొల్పారు. భగవంత్ మన్ 2011లో అందులో చేరారు. 2012లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడారు. 2014 లోక్‌సభకు ముందు ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. కానీ, కాంగ్రెస్‌లో చేరడానికి భగవంత్ మన్ నిరాకరించి అరవింద్ కేజ్రీవాల్  పంపిన ఆహ్వానాన్ని స్వీకరించి ఆప్‌లో చేరారు. ఆ పార్టీ టికెట్‌పైనే రెండు లక్షల ఓట్ల మెజారిటీతో సంగ్రూర్ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు.

ఆయన పార్టీలో చేరి.. ఎంపీగా గెలిచినప్పటికీ ఆయన తన వ్యాఖ్యల్లో చురుకుదనం, వ్యంగ్యాన్ని అట్లాగే మెయింటెయిన్ చేశారు. మద్యం తాగడాన్ని మాత్రం మానలేదు. చాలా సార్లు సభలకూ మద్యం మత్తులోనే హాజరయ్యేవాడని తోటి ఎంపీలు ఆరోపించేవారు. 2017 జనవరిలో ఓ ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తూ.. కిస్ చేస్తూ కుప్పకూలిపోయారు. కానీ, 2019 కల్లా ఆయనలో చాలా మార్పు వచ్చిందని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.

భగవంత్ మన్ మద్యం సేవించడం మానేస్తున్నట్టు ప్రమాణం చేశాడని అరవింద్ కేజ్రీవాల్ బహిరంగంగా ప్రకటించేశారు. తాజా ఎన్నికల్లో భగవంత్ మన్ ఎక్కడ కూడా అదుపుతప్పినట్టు కనిపించలేదు. ఎక్కడా తూలలేదు.. అనవసరపు మాటలూ వదల్లేదు. చాలా బ్యాలెన్స్‌డ్‌గా కనిపించారు. 

2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆయన తన భార్యకు విడాకులిచ్చి పూర్తి కాలం ప్రజలకు అంకితం చేస్తారని భగవంత్ మన్ ప్రకటించారు. ఆయన కొడుకు, కూతురు అమెరికాలో నివసిస్తున్నారని వివరించారు. అయితే, భగవంత్ మన్ కేవలం ఢిల్లీ నుంచి పాలించే నేతకు రబ్బర్ స్టాంప్ మాత్రమేనన్న వాదనలను ఆయన మిత్రులు కొట్టిపారేస్తున్నారు. ఎందుకంటే భగవంత్ మన్ మనుషులను సులువుగా అంచనా వేయగలడని, శత్రువులు, స్నేహితులను ఒకే రకంగా ట్రీట్ చేస్తున్నట్టు కనిపించే నేత అని వివరించారు. జనవరి 19న ఆప్ సీఎం క్యాండిడేట్ కోసం ఫోన్ ఇన్ పోల్ నిర్వహించగా.. సుమారు 21 లక్షల మంది పాల్గొని స్పందించినట్టు ఆప్ తెలిపింది. అందులో 93 శాతం మంది భగవంత్ మన్‌నే సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని కోరినట్టు వివరించింది.

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu