దివంగత ప్రధాని ఇందిరా గాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీ సతీమణే ఈ మేనకా గాంధీ. 17 ఏళ్ల వయసులో మోడలింగ్‌లో తన తొలి బ్రేక్‌ను పొంది.. బాంబే డైయింగ్‌లో పనిచేశారు. సంజయ్ గాంధీని తొలిసారిగా డిసెంబర్ 14, 1973న తన మామ మేజర్ జనరల్ కపూర్ కాక్‌టెయిల్ పార్టీలో కలుసుకున్నారు. 1980లో సంజయ్ గాంధీ ఓ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. అప్పుడు మేనకా గాంధీకి కేవలం 23 ఏళ్లు మాత్రమే. 1983లో మేనకా గాంధీని ప్రధాని అధికారిక నివాసం నుంచి బయటకు వెళ్లాల్సిందిగా ఇందిర ఆదేశించారు. మేనకా గాంధీ అజంగఢ్‌కు చెందిన రాజకీయ నాయకుడు అక్బర్ అహ్మద్‌తో కలిసి ‘‘ సంజయ్ విచార్ మంచ్ ’’ను ప్రారంభించారు. 1988లో జనతాదళ్, 1999లో బీజేపీలో చేరారు.
మేనకా గాంధీ .. భారతదేశంలో రాజకీయాలను ఫాలో అయ్యేవారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీ సతీమణే ఈ మేనకా గాంధీ. రాజకీయవేత్తగా, జంతు హక్కుల కార్యకర్తగా, పర్యావరణవేత్తగా ఆమె సేవలందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి మేనకా గాంధీని బీజేపీ మరోసారి బరిలో దించింది. కేంద్ర మహిళా శిశు సంక్షేమ , శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా ఆమె సేవలందించారు.
మేనకా గాంధీ బాల్యం , విద్యాభ్యాసం :
మేనకా గాంధీ ఆగస్టు 26, 1956న ఢిల్లీలో అమర్‌దీప్ కౌర్ ఆనంద్, లెఫ్టినెంట్ కల్నల్ తర్లోచన్ సింగ్ ఆనంద్ దంపతులకు జన్మించారు. సనావర్‌లోని లారెన్స్ స్కూల్‌లో పాఠశాల విద్యను, ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించారు. అనంతరం జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో జర్మన్‌ను చదివారు. కాలేజీ రోజుల్లో మేనక .. పలు అందాల్లో పోటీల్లో పాల్గొని అవార్డులను గెలుచుకున్నారు. ఆమె 17 ఏళ్ల వయసులో మోడలింగ్‌లో తన తొలి బ్రేక్‌ను పొంది.. బాంబే డైయింగ్‌లో పనిచేశారు.
సంజయ్ గాంధీతో పరిచయం, వివాహం :
మేనకా గాంధీ .. సంజయ్ గాంధీని తొలిసారిగా డిసెంబర్ 14, 1973న తన మామ మేజర్ జనరల్ కపూర్ కాక్‌టెయిల్ పార్టీలో కలుసుకున్నారు. పెళ్లికి ముందు సంజయ్ గాంధీకి హెర్నియా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. దీంతో ఉదయం కాలేజీకి వెళ్లి, తనకు కాబోయే భర్తతో మధ్యాహ్నం, సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్ ప్రైవేట్ వార్డులో గడిపేది. మేనకా గాంధీ .. సూర్య పత్రికకు వ్యవస్థాపక సంపాదకురాలు. ఇది ప్రజలలో కాంగ్రెస్ ప్రతిష్టను పునర్నిర్మించడానికి సహాయపడింది. అత్తగారు ఇందిరా గాంధీ, భర్త సంజయ్ గాంధీలతో రెగ్యులర్‌గా ఇంటర్వ్యూలు తీసుకోవడానికి సూర్య పత్రిక ఎంతగానో దోహదం చేసింది.
సంజయ్ గాంధీ మరణం , ఇందిరతో విభేదాలు :
1980లో సంజయ్ గాంధీ ఓ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. అప్పుడు మేనకా గాంధీకి కేవలం 23 ఏళ్లు మాత్రమే. అలాగే కుమారుడు వరుణ్ గాంధీ 3 నెలల పసిగుడ్డు. సంజయ్ మరణం తర్వాత ఇందిరా గాంధీ, మేనకా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రముఖ రచయిత ఖుష్వంత్ సింగ్ ప్రకారం.. సంజయ్ జీవించి వున్నప్పుడు కూడా మేనక పట్ల ఇందిర అంతగా అభిమానం చూపలేదు. 1983లో మేనకా గాంధీని ప్రధాని అధికారిక నివాసం నుంచి బయటకు వెళ్లాల్సిందిగా ఇందిర ఆదేశించారు. ఆ సమయంలో అత్తా కోడళ్ల మధ్య బహిరంగంగానే వాగ్వాదం జరిగిందని అంటారు.
మేనకా గాంధీ రాజకీయ ప్రవేశం :
సఫ్దర్ జంగ్ రోడ్‌తో బంధం తెగిపోతుందని తెలియగానే .. మేనకా గాంధీ అజంగఢ్‌కు చెందిన రాజకీయ నాయకుడు అక్బర్ అహ్మద్‌తో కలిసి ‘‘ సంజయ్ విచార్ మంచ్ ’’ను ప్రారంభించారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు సీట్లు గెలుచుకుంది. 1984లో అమేథీ నుంచి తన బావగారు రాజీవ్ గాంధీపై స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1988లో మేనకా గాంధీ.. వీపీ సింగ్ జనతాదళ్ పార్టీలో చేరి ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
1989లో ఆమె పిలిభిత్ లోక్‌సభ స్థానం నుంచి జనతాదళ్ టికెట్‌పై ఎన్నికయ్యారు. ఇదే సెగ్మెంట్ నుంచి మేనకా గాంధీ ఆరు సార్లు ప్రాతినిథ్యం వహించారు. 1999లో మేనకా గాంధీ బీజేపీలో చేరారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అటల్ బిహారీ వాజ్‌పేయ్ కేబినెట్‌లో ఆమె కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిగా నియమితులయ్యారు. 2014లో నరేంద్ర మోడీ కేబినెట్‌లోనూ స్థానం దక్కించుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సుల్తాన్‌పూర్ నుంచి గెలుపొందిన మేనకా గాంధీకి కేంద్ర మంత్రివర్గంలో ఎలాంటి పదవీ దక్కలేదు. etymology, law, animal welfare విభాగాలపై మేనకా గాంధీ పలు పుస్తకాలు రాశారు.