తల్లిని చంపి, శరీరభాగాలను వండుకుతిన్న వ్యక్తికి.. కుమార్తె వివాహానికి హాజరు కావడానికి అనుమతించిన హైకోర్టు..

Published : Feb 21, 2023, 09:06 AM IST
తల్లిని చంపి, శరీరభాగాలను వండుకుతిన్న వ్యక్తికి..  కుమార్తె వివాహానికి హాజరు కావడానికి అనుమతించిన హైకోర్టు..

సారాంశం

తాత్కాలిక బెయిల్ మంజూరు చేసేందుకు కోర్టు ఒప్పుకోలేదు. కానీ పోలీసు ఎస్కార్ట్‌తో వివాహానికి హాజరయ్యేందుకు నిందితుడికి అనుమతిస్తామని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. 

ముంబై : తల్లిని చంపి, ఆమె శరీరావయవాలను వండుకుని తిన్న కేసులో దోషిగా తేలిన వ్యక్తిని, తన కుమార్తె వివాహానికి పోలీసు ఎస్కార్ట్‌లో హాజరు కావడానికి బాంబే హైకోర్టు అనుమతించింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో 2021లో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేపింది. ఈ ఘటనలో నిందితుడైన కొల్హాపూర్ వ్యక్తి సునీల్ రామ కూచ్‌కోరవికి  జులై 2021లో ఉరిశిక్ష విధించింది కోర్టు.

హత్యానేరం కింద చనిపోయే వరకు మెడకు ఉరిబిగించి శిక్ష అమలు చేయాలని హైకోర్టు ధృవీకరించింది. అత్యంత జుగుస్సాకరమైన, సమాజంలో భయాందోళనలు రేకెత్తించే ఈ కేసు అత్యంత అరుదైనదని న్యాయమూర్తి ఆ సందర్భంగా వ్యాఖ్యానించారు.సోమవారం విచారణ సందర్భంగా, కూచ్‌కొరవి తరపున వాదిస్తున్న న్యాయవాది యుగ్ మోహిత్ చౌదరి వాదిస్తూ, అతను తన తల్లిని చంపిన ఉద్దేశ్యం ఇంకా తెలియరాలేదని, ఆ ఘటన మద్యం మత్తులో జరిగిందని వివరించారు. 

“అతని ఉద్దేశ్యం మాకు తెలియదు. ఈ ఘటనతో అతని కుటుంబం కూడా షాక్‌కు గురైంది. అతను అద్భుతమైన వ్యక్తి అని అందరూ అంటారు. అతని మీద ఎలాంటి నేర చరిత్ర, తప్పుడు ఆరోపణలు లేవు. మచ్చలేని రికార్డు. అయితే, అతనికి తరచుగా తలనొప్పి వచ్చేది, కాబట్టి అతను మద్యం సేవించేవాడు. ఆ మత్తులోనే ఈ దారుణానికి ఒడిగట్టాడు’ అని చెప్పుకొచ్చారు.

కూతురి వివాహానికి హాజరయ్యేందుకు వారం రోజుల పాటు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయవచ్చని న్యాయవాది చౌదరి తెలిపారు. అయితే, తాత్కాలిక బెయిల్ మంజూరు చేసేందుకు తాము ఇష్టపడటం లేదని, కాకపోతే నిందితుడిని పోలీసు ఎస్కార్ట్‌తో వివాహానికి అనుమతిస్తామని న్యాయమూర్తులు ఎఎస్ గడ్కరీ, పిడి నాయక్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. నిందితుడు సమాజంలోని దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వర్గాలకు చెందినవాడు కాబట్టి ఎస్కార్ట్ ఛార్జీలను భరించలేడని న్యాయవాది చెప్పినప్పుడు, ఛార్జీలను మాఫీ చేయడానికి బెంచ్ అంగీకరించింది.

ముంబై ఈవెంట్‌లో గాయకుడు సోనూ నిగమ్, బృందంపై దాడి.. పోలీసు స్టేషన్‌ లో ఫిర్యాదు..

"నేరస్తుడి కుమార్తె వివాహం కాబట్టి.. అతనికి మేము మూడు రోజుల పాటు జైలు నుండి బయటకు తీసుకురావడానికి అనుమతిస్తున్నాం" అని బెంచ్ తెలిపింది. ఫిబ్రవరి 23-25, 2023 తేదీలలో ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు నిందితుడిని బయటకు తీసుకురావడానికి కోర్టు అనుమతించింది. సాయంత్రం 6 గంటలలోపు అతన్ని తిరిగి జైలుకు తీసుకురావాలని కోర్టు ఆదేశించింది.

రాష్ట్ర ప్రభుత్వం 2021లోనే హైకోర్టులో (మరణశిక్ష కోసం) ధృవీకరణ పిటిషన్‌ను దాఖలు చేసింది. ధృవీకరణ పిటిషన్ ఇంకా వినవలసి ఉంది. ఈలోగా, నిందితుడు తన కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు తాత్కాలిక బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.

ఇదిలా ఉండగా, మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లోని స్థానిక కోర్టు 35 ఏళ్ల కూలీకి తన తల్లిని చంపి, ఆమె శరీర భాగాలను తిన్న కేసులో 2021, జులైలో మరణశిక్ష విధించింది.  ఈ సంఘటన సమాజంలోని ప్రతీ ఒక్కరిని కదిలించిందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఇది ఒక హత్య మాత్రమే కాదు, "అత్యంత క్రూరత్వం, సిగ్గులేనితనం"తో ముడిపడి ఉందని కోర్టు అభిప్రాయపడింది.

ఈ చర్య తర్వాత నిందితుడి ప్రవర్తనలో పశ్చాత్తాపం లేదని కూడా న్యాయమూర్తి గమనించారు. న్యాయస్థానం తీర్పు సమయంలో మాట్లాడుతూ  "ఆ తల్లి అనుభవించిన బాధను మాటల్లో వివరించలేము, అతను మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని ఈ నేరం చేసాడు. అతను తన నిస్సహాయ తల్లి ప్రాణాలు తీశాడు. ఇది మాతృత్వానికి తీరని అవమానం" అని పేర్కొన్నారు. 

ఆగస్ట్ 2017లో సునీల్ రామ కూచకోరవి తన తల్లిని చంపాడు. హత్య జరిగిన వెంటనే, కుచ్‌కొరవి పొరుగున ఉన్న పిల్లవాడు రక్తపు మరకలతో అతను తన తల్లి మృతదేహం దగ్గర నిలబడి ఉండటం చూశాడు. చిన్నారి అరుపులు, కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫోన్ చేశారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు ఇన్‌స్పెక్టర్ భౌసాహెబ్ మల్గుండే ప్రాథమికంగా పరిశీలించగా, మృతదేహం రక్తపు మడుగులో పడి ఉండడంతో అవయవాలు బయటికి వచ్చి ఉన్నాయి. తల్లి గుండె పళ్లెంలో ఉండగా, మరికొన్ని అవయవాలు ఆయిల్ టిన్‌పై ఉండటాన్ని పోలీసులు చూశారు. ఈ ఘటన చూసి కోపోద్రిక్తులైన  గుంపు నుండి పోలీసులు కూచ్‌కొరవిని రక్షించవలసి వచ్చింది.

ప్రాసిక్యూషన్ ప్రకారం, కూచుకొరవి మద్యానికి బానిస. తరచూ తాగివచ్చి భార్యను కొడుతుండడంతోఅతని భార్య అతన్ని విడిచిపెట్టింది. దీంతో తన తల్లితో ఉంటున్నాడు. అయితే మద్యానికి బానిసై పింఛన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ నిత్యం ఆమెతో గొడవ పడేవాడు.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం