
ముంబై : సోమవారం ముంబైలోని చెంబూర్‌లో జరిగిన సంగీత కార్యక్రమంలో గాయకుడు సోను నిగమ్, అతని బృందం మీద కొంతమంది దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సోనూ టీమ్‌కు చెందిన వ్యక్తిని వేదిక మీద నెట్టడం కనిపిస్తుంది.
ఈ నాటకీయ సంఘటనల తర్వాత, సోనూ నిగమ్ చెంబూర్ పోలీస్ స్టేషన్‌లో దీనిమీద ఫిర్యాదు నమోదు చేయడానికి వెళ్లారు. దీంతో సంఘటన గురించి మరిన్ని తెలుసుకోవడానికి పోలీసు అధికారులు సోనూ నిగమ్‌తో మాట్లాడుతున్నారు. అయితే, ఈ వీడియోకు సంబంధించిన వాస్తవాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.
నీతి ఆయోగ్ నయా సీఈవోగా సుబ్రమణ్యం.. పరమేశ్వరన్ అయ్యర్ ప్రపంచబ్యాంకుకు బదిలీ
శివసేన (యుబిటి) నాయకుడు ప్రకాష్ ఫాటర్‌పేకర్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడానికి సోనూ నిగమ్ చెంబూర్ కు వచ్చారు. సోను నిగమ్ వేదికపైకి నడుచుకుంటూ వెళుతుండగా, తమ అభిమాన గాయకుడితో సెల్ఫీలు దిగేందుకు కొందరు అక్కడికి చేరుకున్నారు.
“సోను నిగమ్ వేదికపై నుంచి దిగుతుండగా, కొంతమంది సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ఆ సమయంలో, బాడీగార్డులు వారిని తోసేందుకు ప్రయత్నించారు, కానీ పొరపాటున, సోను నిగమ్ బృందంలోని ఒక వ్యక్తిని పొరపాటున నెట్టారు. సోనూ నిగమ్ కు ఏమీ జరగలేదు" అని శివసేన (యుబిటి) నాయకుడు ప్రకాష్ ఫాటర్‌పేకర్ అన్నారు. ఇదిలా ఉండగా, సోనూ నిగమ్ మేనేజర్‌తో ఫాటర్‌పేకర్ కుమారుడు దురుసుగా ప్రవర్తించాడని, వేదికపై నుంచి బయటకు వెళ్లమని అసభ్యంగా ప్రవర్తించాడని సోనూ నిగమ్ బృందం ఆరోపించింది.
"సోనూ నిగమ్ ప్రదర్శన ముగించి స్టేజి దిగి వస్తుండగా, ఎమ్మెల్యే కుమారుడు మొదట సోను నిగమ్ బాడీగార్డ్ హరిని తోసేశాడు. ఆ తరువాత సోనూ నిగమ్ ను తోసాడు. ఈ కార్యక్రమంలో సోను నిగమ్ మేస్త్రీ కుమారుడు రబ్బానీ ఖాన్ కూడా ఉన్నాడు. ఈ పెనుగులాటలో అతను వేదికపై నుండి కింద పడిపోయాడు. దీంతో అతడికి చాలా గాయాలు అయ్యాయి. వెంటనే అతనిని చెంబూర్‌లోని జెన్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ మొత్తం సంఘటనతో సోనూ నిగమ్ షాక్ అయ్యారు. సోనూ నిగమ్ కు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ రబ్బానీకి చికిత్స కొనసాగుతోంది"అని చెప్పారు.