ఆయన ఆధార్ కార్డు పోయింది.. మంగళూరు బ్లాస్ట్ స్పాట్‌లో లభ్యం.. ఏం జరిగిందంటే?

By Mahesh KFirst Published Nov 20, 2022, 5:08 PM IST
Highlights

కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి తన ఆధార్ కార్డును పోగొట్టుకున్నాడు. ఆ ఆధార్ కార్డు మంగళూరు బ్లాస్ట్ స్పాట్‌లో దొరికింది. పోలీసులు ఆయనకు ఫోన్ చేయగా అసలు విషయం బయటపడింది.
 

బెంగళూరు: కర్ణాటక మంగళూరులో ఆటో బ్లాస్ట్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ పేలుడులో ఉగ్రకోణం ఉన్నదని రాష్ట్ర పోలీసులు తెలిపారు. ఈ పేలుడు జరిగిన దగ్గరే ఓ ఆధార్ కార్డు దొరికింది. ఆ ఆధార్ కార్డు హోల్డర్‌కు పోలీసులు ఫోన్ చేసి ఆరా తీయగా కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ఆధార్ కార్డు పేలుడుతో ఏమాత్రం సంబంధం లేని మరో వ్యక్తికి చెందినదని తేలింది.

ఆ ఆధార్ కార్డు హోల్డర్ పేరు ప్రేమరాజ్ హుతాగి. ఆయన తుమకూరు డివిజన్‌లో ఇండియన్ రైల్వేస్‌ ఉద్యోగి. ఆయన ఆధార్ కార్డునే బ్లాస్ట్‌కు కారణమైన వ్యక్తి పట్టుకుని ఆటోలో ప్రయాణించినట్టు తెలుస్తున్నది.

ప్రేమరాజ్ హుతాగి రెండు సార్లు ఆధార్ కార్డు రెండు సార్లు పోగొట్టుకున్నాడు. కానీ, అది ఎక్కవ పోగొట్టుకున్నది సరిగ్గా తెలియదు. ఆయన ఆధార్ కార్డు బ్లాస్ట్ స్పాట్‌లో దొరకడంతో పోలీసులు ఆయన కు ఫోన్ చేశారు. ‘ఉదయం 7.30 గంటలకు నేను పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ నుంచి ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నాను. నా ఆధార్ కార్డు ఎక్కడ పోగొట్టుకున్నానని అడిగారు. నా తల్లిదండ్రుల వివరాలనూ వారు అడిగారు. అన్నింటికి సమాధానం చెప్పా.. నా ఫొటోలు కూడా పంపించా’ అని హుతాగో తెలిపాడు. వారు చెప్పిన తర్వాతే నాకు మంగళూరు బ్లాస్ట్ గురించి తెలిసిందని అన్నాడు.

Also Read: ఉగ్రవాద చర్య వల్లే మంగళూరు ఆటో పేలుడు - కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్

‘నాకు ఆ ఘటన తో సంబంధం లేదు. పోలీసులు చెబితే ఆ ఘటన గురించి తెలిసింది. అక్కడ నా ఆధార్ కార్డు దొరికినట్టు చెప్పారు. నా ఆధార్ కార్డును నేను పోగొట్టుకున్నది వాస్తవం. కానీ, దాన్ని మంగళూరులో మాత్రం పోగొట్టుకోలేదు’ అని వివరించాడు. అయితే, యునిక్ ఐడీ ఉన్నందున ఆధార్ కార్డు పోయిందని రిపోర్ట్ చేయలేదని, ఐడీ ద్వారా మరో కార్డ్ ప్రింట్ తీసుకున్నానని తెలిపాడు. కానీ, తన ఆధార్ కార్డు ఇంత దారుణానికి దుర్వినియోగం చేస్తారని ఊహించలే దని వివరించాడు.

ప్రెషర్ కుక్కర్‌లో బ్యాటరీలు, పేలుడు పదార్థాలను పట్టుకుని దుండగుడు ఆటో ఎక్కాడని, ఆ కుక్కరే పేలిపోయిందని కర్నాటక డీజీపీ ప్రవీన్ సూద్ తెలిపారు. ఈ ఘటనలో అతనితో పాటు డ్రైవర్ కూడా గాయపడ్డాడు. నిందితుడు మాట్లాడలేకపోతున్నాడని చెప్పారు.

ఇది ప్రమాదం కాదని, ఇది ఉగ్రవాద చర్యే అని, సీరియస్ డ్యామేజీ చేయాలనేదే వారి ఉద్దేశ్యమని డీజీపీ వెల్లడించారు.

click me!