త్వరలో భారత సైనికులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు..  టెండర్లుకు ఆహ్వానం..

By Rajesh KarampooriFirst Published Nov 20, 2022, 5:01 PM IST
Highlights

దేశం కోసం సరిహద్దులో సేవలందిస్తున్న సైనికులకు 62,500 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను కొనుగోలు చేయడానికి భారత సైన్యం టెండర్లుకు ఆహ్వానం పలికింది. రక్షణ మంత్రిత్వ శాఖ ఈ జాకెట్ల కోసం మేక్ ఇన్ ఇండియా కింద రెండు వేర్వేరు టెండర్లను జారీ చేసింది. సాధారణ ప్రక్రియలో 47,627 జాకెట్లు , అత్యవసర సేకరణ విధానాలలో 15,000 జాకెట్లు అందిచాలని భావిస్తుంది. వచ్చే మూడేళ్లలో ఈ ప్రక్రియ పూర్తి చేయబడుతుంది, 

శత్రు దేశాల ఆగడాలను అడ్డుకోవడానికి.. ఉగ్రదాడులను సమర్థవంతంగా ఎదుర్కోవానికి భారత సైన్యం సిద్దమవుతోంది. ఈ  మేరకు భారత ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. భారత సైన్యంలో పనిచేస్తున్న ఫ్రంట్‌లైన్ సైనికులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు 62,500 లెథల్ స్టీల్ కోర్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల కొనుగోలు చేయడానికి ఇండియన్ ఆర్మీ టెండర్లను ఆహ్వానించింది. ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు సైనికులను రక్షించడంలో సహాయపడతాయి. ఆర్మీ అధికారులు ఈ ప్రక్రియ గురించి తెలియజేశారు.

ఇండియన్ ఆర్మీ అధికారులు అందించిన సమాచారం ప్రకారం.. మేక్ ఇన్ ఇండియా చొరవ కింద ఈ జాకెట్ల కోసం రక్షణ మంత్రిత్వ శాఖ రెండు వేర్వేరు టెండర్లను జారీ చేసింది. ఇందులో  సాధారణ మార్గంలో  47,627 జాకెట్లకు సేకరణ టెండర్లు వేశారు. వచ్చే 18-24 నెలల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు. రెండవది అత్యవసర సేకరణ విధానాల క్రింద 15,000 జాకెట్లను కొనుగోలు చేయనున్నారు. ఇది రాబోయే మూడు,నాలుగు నెలల్లో ఖరారు చేయబడుతుందని ఇండియన్ ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ రెండు టెండర్ల ద్వారా కొనుగోలు చేస్తున్న జాకెట్లు గ్రేడ్-4గా ఉంటాయని సైనిక అధికారులు తెలిపారు. 

ఈ బుల్లెట్ ప్రూఫ్ దుస్తులు ఉక్కు కోర్ బుల్లెట్ల నుంచి సైనికులను కాపాడుతాయని తెలిపారు.ఈ కొనుగోలుకు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ జాకెట్లను మొదట జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలలో మోహరించిన సైనికులకు అందించాలని భావిస్తున్నారు. ఈ జాకెట్లు భారతదేశంలోనే తయారు చేయబడుతాయని అధికారులు తెలిపారు. వచ్చే 18-24 నెలల్లో పూర్తవుతుందని భారత ఆర్మీ అధికారులు తెలిపారు.

బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ సైనికుడిని 7.62 మిమీ ఆర్మర్-పియర్సింగ్ రైఫిల్ మందుగుండు సామగ్రితో పాటు 10 మీటర్ల దూరం నుండి కాల్చే స్టీల్ కోర్ బుల్లెట్ల నుండి రక్షించగలదని ఒక్కో జాకెట్ 10 కిలోల కంటే తక్కువ బరువు ఉంటుందని ఆర్మీ జాబితా చేసిన స్పెసిఫికేషన్‌లు పేర్కొంటున్నాయి. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల కొరత  భారత సైన్యంలో చాలా సంవత్సరాలుగా ఉంది. ఎట్టకేలకు సైనికులకు రక్షణ కల్పించడానికి నాణ్యమైన బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్‌ల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వశాఖ సిద్దమైంది.

ఇదిలా ఉంటే.. ఇటీవలే సైన్యం 750 డ్రోన్ల కొనుగోలుకు టెండర్‌ను జారీ చేయడం గమనార్హం. అదే సమయంలో.. 1,000 నిఘా కాప్టర్ల కొనుగోలుకు టెండర్ కూడా జారీ చేయబడింది. దీనితో పాటుగా సైన్యం చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వెంబడి తన బలాన్ని పెంచుకోవడానికి 80 రిమోట్‌తో నిర్వహించబడే మినీ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్‌ల కొనుగోలుకు టెండర్లు కూడా జారీ చేసింది. 

click me!