
బెంగళూరు : ఆస్తి విషయంలో గొడవల కారణంగా.. తన తండ్రిని హత్య చేసేందుకు కోటి రూపాయలకు సుపారీ ఇచ్చి ఇద్దరు కిల్లర్లను నియమించిన 32 యేళ్ల వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మారతహళ్లిలోని కావరప్ప బ్లాక్‌లో నివాసం ఉంటున్న నారాయణ స్వామి ఫిబ్రవరి 13న తన అపార్ట్‌మెంట్ బయట హత్యకు గురయ్యాడు. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు స్వామిపై కొడవలితో దాడిచేసి పారిపోయారు. నారాయణ స్వామి కుమారుడు ఎన్ మణికంఠ హత్యకు ప్రత్యక్ష సాక్షి కావడంతో అదే రోజు మారతహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మణికంఠతో పాటు హోస్కోటేకు చెందిన ఆదర్శ టి (26), శివ కుమార్ ఎన్‌ఎం (26)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మణికంఠ నిరుద్యోగి. ఆస్తికోసం తల్లిదండ్రుల హత్యకు పథకం పన్నాడు. అంతేకాదు అతని మొదటి భార్య హత్యకు గురైంది. రెండో భార్య మీద అతనే హత్యాయత్నంచేసి బెయిల్ మీద బైటికి వచ్చాడు. దీనికి సంబంధించి వివరాల్లోకి వెడితే...
మణికంఠ భార్య అర్చనకు.. మణికంఠ తండ్రి ఫ్లాట్‌ను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నందున కలత చెందానని.. అందుకే ఈ పనికి ఒడిగట్టానని మణికంఠ పోలీసులకు చెప్పాడు. రియల్టర్ అయిన మణికంఠ తండ్రి నారాయణ స్వామి కావేరప్ప బ్లాక్‌లో అపార్ట్‌మెంట్ ఉంది. నారాయణస్వామి, ఆయన భార్య.. కొడుకు మణికంఠ, అతని భార్య అర్చనలు కలిసి అందులోని ఓ ఫ్లాట్‌లో నివసిస్తున్నారు.
మేఘాలయాలో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 3.7 తీవ్రత నమోదు..
అర్చన మణికంఠకు రెండవ భార్య, వారికి ఒక పాప కూడా ఉంది. అతని మొదటి భార్య 2013లో హత్యకు గురైంది. ఆమెను హత్య చేశాడనే ఆరోపణలపై మణికంఠను పోలీసులు అరెస్టు చేశారు. అయితే 2020లో ఈ కేసులో మణికంఠ నిర్దోషిగా విడుదలయ్యాడు. ఆ తరువాత అర్చనను రెండో వివాహం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కొంతకాలానికి మణికంఠ, అర్చన మధ్య విభేదాలు రావడంతో గతేడాది ఆగస్టులో ఆమెను కత్తితో పొడిచి గాయపరిచాడు. హత్యాయత్నం కింద కేసు నమోదయ్యింది.
మణికంఠ బెంగళూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించాడు. అక్కడే అతనికి ఆదర్శ, శివ కుమార్‌లతో స్నేహం ఏర్పడింది. మణికంఠ ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయితే, విభేదాల కారణంగా అర్చన, మణికంఠలు విడివిడిగా జీవించడం ప్రారంభించారు. దీంతో కోడలు జీవితం, మనవరాలి జీవితాలకు భరోసాగా ఉంటుందని.. నారాయణ స్వామి తన అపార్ట్‌మెంట్‌లోని ఒక ఫ్లాట్‌ను అర్చన పేరు మీద రిజిస్టర్ చేయాలని నిర్ణయించుకున్నాడు.
తద్వారా ఆమె స్వతంత్ర జీవితం గడపవచ్చని, ఎలాగూ మణికంఠ అర్చనను ఆర్థికంగా ఆదుకోడని స్వామి భావించాడు. మణికంఠకు డబ్బులు ఇవ్వడం కూడా మానేశాడు. ఈ పరిణామాలతో చిరాకెత్తిన మణికంఠ.. ఆస్తి కోసం తన తండ్రితో పాటు తల్లిని కూడా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఇవే మణికంఠను రెచ్చగొట్టాయని డిసిపి (వైట్‌ఫీల్డ్) ఎస్ గిరీష్ తెలిపారు. మణికంఠకు నలుగురు అక్కా చెల్లెళ్లు ఉన్నారు.
మణికంఠ దీంతో శివ కుమార్, ఆదర్శలతో కలిసి హత్యకు పథకం పన్నాడు. "పని పూర్తి చేసిన తర్వాత శివ కుమార్‌కు కోటి రూపాయల నగదు ఇస్తానని మణికంఠ వాగ్దానం చేశాడు. ఆదర్శ, శివ కుమార్‌లకు ఒక్కొక్కటి చొప్పున ఫ్లాట్, కారు ఇస్తానని కూడా హామీ ఇచ్చాడు" అని గిరీష్ చెప్పారు. ఈ మేరకు హత్య కోసం శివ కుమార్‌కు రూ.లక్ష అడ్వాన్స్ కూడా చెల్లించారు.