
Madhya Pradesh: ఏప్రిల్ 27న మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో వేధింపుల ప్రయత్నాన్ని ప్రతిఘటించినందుకు ఒక మహిళను కదులుతున్న రైలు నుండి బయటకు తోసేశాడనే ఆరోపణలపై 26 ఏండ్ల ఓ వ్యక్తిని పోలీసులు తికమ్‌ఘర్‌లో అరెస్టు చేశారు.
వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని బండా జిల్లాకు చెందిన 22 ఏండ్ల యువతి తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఛతర్‌పూర్‌లోని బాగేశ్వర్ ధామ్‌లోని ఆలయాన్ని సందర్శించడానికి వచ్చింది. ఈ క్రమంలోనే రైలులో ప్రయాణిస్తుండగా.. రైలులో ఉన్న సహ ప్రయాణికుడు ఆమెను వేధింపులకు గురిచేశాడు. ఆమె అతని ప్రయత్నాలను ప్రతిఘటించింది. ప్రయాణికుడిని తనకు దూరంగా ఉండమని కోరింది. అతడ్ని నిలువరించేందుకు ఆ వ్యక్తి చేతిని కొరికింది. ఈ ఘటనతో సదరు ప్రయాణికుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. రైలు ఖజురహో, మహోబా స్టేషన్ల మధ్య ఉన్న సమయంలో యువతిని కదులుతున్న రైలు నుంచి తోసేశాడు. వేగంగా ప్రయాణిస్తున్న రైలు నుంచి తోసేయడంతో యువతికి తీవ్ర గాయాలయ్యాయి.
అటుగా వెళ్తున్న పలువురు స్థానికులు రైలు పట్టాల పక్కన తీవ్ర గాయాలతో పడి ఉన్న యువతిని గుర్తించారు. వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అధికారులు.. తీవ్ర గాయాలపాలైన బాధితురాలిని ఛతర్‌పూర్‌లోని జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత ఆమెను గ్వాలియర్ కు రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆ యువతి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రైలు లోంచి తోసేసిన ఈ దుర్ఘటన గురించి ఫిర్యాదు నమోదుచేసుకున్నామని జబల్‌పూర్ ప్రభుత్వ రైల్వే పోలీసు ఎస్పీ వినాయక్ వర్మ వెల్లడించారు. యువతిని తోసేసిన వ్యక్తిని గుర్తించామని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్ జిల్లాలోని బాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరి గ్రామానికి చెందిన నిందితుడు రామ్ బాబు యాదవ్ (26)ని అరెస్ట్ చేశారు. అతడు తికమ్‌గఢ్‌లో ఉన్నట్లు తమకు సమాచారం అందిందని ప్రభుత్వ రైల్వే పోలీసు (GRP) సూపరింటెండెంట్ వినాయక్ వర్మ తెలిపారు.
నిందితుడికి చెందిన స్థలం నుండి గమనింపబడని మొబైల్ ఫోన్ నుండి పోలీసులకు లీడ్స్ లభించాయి, అలాగే సహ-ప్రయాణికుల నుండి అతని గురించి సమాచారం పోలీసులకు లభించింది. దీంతో GRP మరియు స్థానిక పోలీసుల సంయుక్త బృందం దర్యాప్తు ప్రారంభించిందని SP తెలిపారు. ఈ క్రమంలోనే నిందితుడిని అరెస్టు చేసినట్టు తెలిపారు. ఇదిలావుండగా, బాపట్ల జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్‌లో ఓ మహిళపై సాముహిక అత్యాచారం ఘటన తీవ్ర కలకలం రేపింది.
రేపల్లె రైల్వేస్టేషన్ ఆవరణలో శనివారం అర్దరాత్రి గర్భంతో ఉన్న మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆదివారం ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో పి విజయకృష్ణ, పి నిఖిల్‌తో పాటు ఒక మైనర్ ఉన్నారు. వీరు ముగ్గురు కూడా రైల్వే స్టేషన్ సమీపంలోని నేతాజీ నగర్‌కు చెందినవారు. వారిలో ఒకరికి మూడు దొంగతనాల కేసుల్లో కూడా ప్రమేయం ఉంది. ఇక, బాధితురాలికి ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.