సీఎం మమతా బెనర్జీ నివాసంలో భద్రతా లోపం.. నివాస ప్రాంగణంలోకి ఓ వ్యక్తి ప్రవేశించి రాత్రంతా అక్కడే.. !

By Mahesh KFirst Published Jul 3, 2022, 4:47 PM IST
Highlights

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి భద్రతా లోపం ఏర్పడినట్టు అధికారులు తెలిపారు. ఓ వ్యక్తి రాత్రి సీఎం నివాసంలోకి ప్రవేశించి రాత్రంగా అక్కడే ఉన్నారు. ఉదయం ఆ వ్యక్తి కనిపించగానే పోలీసులు అరెస్టు చేశారు.
 

కోల్‌కతా: సీఎం మమతా బెనర్జీ నివాసంలో భద్రతా లోపం ఏర్పడింది. ఓ వ్యక్తి శనివారం రాత్రి కోల్‌కతాలోని సీఎం మమతా బెనర్జీ నివాస ప్రాంగణంలోకి ప్రవేశించి రాత్రంతా అక్కడే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఉదయమే పోలీసు సిబ్బంది ఆ వ్యక్తిని అరెస్టు చేసింది. చీఫ్ మినిస్టర్ సెక్యూరిటీ స్టాఫ్ ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.

కోల్‌కతాలోని సీఎం మమతా బెనర్జీ నివాసంలోకి శనివారం రాత్రి ఓ వ్యక్తి అక్రమంగా ప్రవేశించారు. రాత్రంతా అక్కడే ఉన్నట్టు తెలిసింది. ఉదయం ఆ వ్యక్తి కనిపించగానే పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతున్నట్టు వివరించారు. సీఎం మమతా బెనర్జీకి భద్రతా లోపం ఏర్పడినట్టు తెలియగానే కోల్‌కతా సీనియర్ పోలీసు అధికారులు స్పాట్‌కు చేరుకున్నారు. కమిషనర్ వినీత్ గోయల్ కూడా అక్కడికి వెళ్లారు.

ఆ వ్యక్తి జెడ్ క్యాటగిరీ సెక్యూరిటీ జోన్‌ను తప్పించుకుని ఎలా లోపలికి ఎంటర్ అయ్యాడనే విషయమపై దర్యాప్తు చేస్తున్నట్టు ఇండియా టుడే సంస్థ కొన్ని వర్గాల అభిప్రాయాలను పేర్కొంటూ కథనం రాసింది. ఈ భద్రతా లోపం కలిగించడం వెనుక గల లక్ష్యాలనూ వారు పరిశోధిస్తున్నట్టు వివరించింది. 

సీఎం నివాసంలోకి ఎంటర్ అయిన వ్యక్తి ఒక దొంగ లేదా మానసిక స్థిమితం లేనివాడై ఉంటాడని ప్రాథమిక విచారణ ప్రకారం చెబుతున్నారు. అయితే, విచారణలో ఇతర కోణాల్లోనూ వివరాలు తేలే అవకాశాలు లేకపోలేదని పేర్కొన్నారు. 

గత నెలలో సీఎం మమతా బెనర్జీ నివాసానికి సమీపంలోనే రెండు హత్యలు జరగడం కలకలం రేపాయి. దీదీ నివసిస్తున్న ఏరియాలో సెక్యూరిటీ గురించిన అనుమానాలను రేపాయి. ఈ ఏరియాలో బిజినెస్‌మ్యాన్ అశోక్ షాను కత్తితో పొడిచి చంపగా.. ఆయన భార్యను తుపాకీతో కాల్చి చంపిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన తర్వాతే మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ఏరియాలో సీసీటీవీలు పని చేయడం లేదని తెలియవచ్చింది. భవానీపూర్ శాంతి సామరస్యంగా ఉండే ప్రాంతం అని, కొన్ని బాహ్య శక్తులు ఇక్కడ అరాచకం సృష్టించాలని ప్రయత్నిస్తున్నట్టు సీఎం మమతా బెనర్జీ అన్నారు. అలాంటి ప్రయత్నాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

click me!