
విలాస జీవితానికి అలవాటు పడ్డాడు. ఎప్పుడూ బైక్ పై షికార్లు.. స్టైలిష్ డ్రెస్సులతో బతికేసేవాడు. ఆ కాస్ట్ లీ జీవితం గడపడానికి డబ్బుల కోసం అమాయకు ఆడపిల్లలను ఎంచుకునేవాడు. వాళ్లను.. వాళ్ల కుటుంబాలను అలవోకగా మోసం చేసి.. డబ్బులు గుంజేవాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
25 ఏళ్ల ఒక యువతి ఇంటికి ఏప్రిల్‌లో వచ్చిన సూరజ్.. ఆమెను పెళ్లిచేసుకుంటానని చెప్పాడు. ఆమెకు తండ్రి లేకపోవడంతో ఆ కుటుంబం చాలా ఇబ్బందులు పడుతోంది. ఇలాంటి సమయంలో వారి నమ్మకాన్ని పొంది, అమ్మాయి సోదరుడికి ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మబలికి 23 వేలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఫోన్లు కూడా ఎత్తడం ఆపేశాడు. ఇలా ఒక్కో రకంగా దాదాపు 11మంది అమ్మాయిలను మోసం చేశాడు.
కొందరు పరువు కోసం పోలీసులకు ఫిర్యాదు చేయకపోగా... కొందరు మాత్రం ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ యువతుల ఫిర్యాదులు అందుకున్న ఎస్పీ.. సూరజ్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. సూరజ్ ఇలా కనీసం 11 మంది యువతులను పెళ్లాడుతానని అబద్ధాలు చెప్పి డబ్బులు దోచుకున్నట్లు సమాచారం. సూరజ్ ఆ యువతులకు ప్రేమ పేరుతో దగ్గరయ్యేవాడని, ఆపై వారి కుటుంబాలను కూడా పెళ్లి పేరుతో నమ్మించేవాడని పోలీసులు తెలిపారు.
ఎక్కువగా గిరిజన కుటుంబాలను టార్గెట్ చేసి, వారికి ఆశలు కల్పించేవాడని, ఆపై యువతులతో ఫోన్లో గంటల తరబడి మాట్లాడేవాడని చెప్పారు. దీంతో నమ్మకం ఏర్పడిన ఆ యువతులు, వారి కుటుంబాలు.. సూరజ్ అడిగే చిన్న మొత్తాలను, ఒక్కోసారి కొంత పెద్ద మొత్తం డబ్బును అతనికి అందించే వారు. ఆ సొమ్ము తన చేతికి రాగానే సదరు యువతులు చేసే ఫోన్లను ఎత్తడం ఆపేసేవాడు సూరజ్. ఇలా మోసాలకు పాల్పడుతున్న సూరజ్‌ను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.