అభినవ శ్రవణ కుమారుడు.. అమ్మానాన్నలను భుజాల మీద మోస్తూ వందల కి.మీ. యాత్ర.. వారి కోరిక కాదనలేకే...

By SumaBala BukkaFirst Published Jul 26, 2022, 8:04 AM IST
Highlights

తల్లిదండ్రుల కోరిక తీర్చడానికి పెద్ద సాహసానికి పూనుకున్నాడు ఓ వ్యక్తి. వారిద్దరినీ తన భుజాలమీద.. కావడిపై మోస్తూ వందల కి.మీ. పాదయాత్ర చేస్తున్నాడు. 

ఉత్తరప్రదేశ్ : భుజంపై కావడి... అందులో ఓ వైపు అమ్మ... మరోవైపు నాన్న.. శక్తినంతా కూడదీసుకుని భారంగా అడుగులు.. ఎండైనా, వానైనా ఆగకుండా సాగే పయనం... ఇలా ఏకంగా వందల కిలోమీటర్లు ప్రయాణం.. ఇది వినగానే మీకు రామాయణంలోని శ్రవణకుమారుడు గుర్తుకు వచ్చాడా? అతని గురించి ఇప్పుడేం సందర్భం ఉందని ఆలోచిస్తున్నారా? అతని గురించి కాదు.. అతనిలాగే తల్లిదండ్రుల కోరిక తీర్చడానికి కష్టపడతున్నాడు వికాస్ గహ్లోత్.. జీవిత చరమాంకంలో కావడి యాత్ర చేయాలన్న తల్లిదండ్రుల ఆకాంక్ష నెరవేర్చడం కోసం.. నేటితరం ఎవ్వరూ సాహసించని యాత్రకు పూనుకున్నాడు. 

వికాస్ గహ్లోత్ ది ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్.  వృద్ధాప్యంలో ఉన్న అతని తల్లిదండ్రులు కావడి యాత్ర చేయాలని అనుకున్నారు. ఎన్నో రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చిన ఈ కాలంలో.. ఈ యాత్ర ఎంత కష్టమయ్యిందో వికాస్ కు తెలుసు. అయినా సరే అమ్మనాన్నల కోరిక ను వికాస్ కాదనలేకపోయాడు. తానే అభినవ శ్రవణకుమారుడి అవతారం ఎత్తాడు. తల్లిదండ్రులిద్దరితో కలిసి గాజియాబాద్ నుంచి హరిద్వార్ వెళ్లి గంగా స్నానం ఆచరించాడు. పవిత్ర జలం సేకరించి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలోని గాజియాబాద్ కు కావడి యాత్ర ప్రారంభించాడు. 

పబ్‌లో ఇద్దరు మహిళల వీరంగం.. ఓ వ్యక్తిపై దాడి.. వీడియో వైరల్

ఇందుకోసం లోహంతో ఓ బలమైన కావడి చేయించాడు.  ఓవైపు అమ్మను, మరోవైపు నాన్నను కూర్చోబెట్టాడు. 20 లీటర్ల గంగాజలం నింపిన డబ్బాను నాన్న దగ్గర పెట్టాడు. వారిద్దరినీ భుజాలపై మోస్తూ నడక మొదలుపెట్టాడు. తాను పడుతున్న కష్టాన్ని తల్లిదండ్రులు చూడకుండా ఉండేందుకు.. వారి కళ్ళకు గంతలు కట్టాడు వికాస్. అతనికి అండగా ఉండేందుకు ఇద్దరు స్నేహితులూ కలిశాడు. హరిద్వార్ నుంచి జూలై 17న గజియాబాద్ తిరుగు ప్రయాణమైన ఈ యాత్ర శనివారం మేరఠ్ చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక జిల్లా పంచాయతీ అధ్యక్షుడు గౌరవ్ చౌదరి, సిబ్బంది అతడిని సన్మానించారు.

click me!