
తమిళనాడులో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తిమీద పోలీసులు కిరాతకంగా వ్యవహరించారు. లాఠీలతో విరుచుకుపడడంతో ఓ వ్యక్తి మరణించాడు. తమిళనాడులోని సేలం జిల్లా పప్పినైచెంపట్టి చెక్ పోస్ట్ సమీపంలో బుధవారం ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.
ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా కోవిడ్ 19 కారణంగా లాక్ డౌన్ అమల్లో ఉంది. మొత్తం 38 జిల్లాలలను మూడు కేటగిరీలుగా విడదీసి లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. కాగా 11 జిల్లాల్లో కఠిన నిబంధనలతో లాక్ డౌన్ అమలులో ఉంది. ఈ 11 జిల్లాల్లో సేలం జిల్లా ఒకటి.
ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు ఎవరు వెళ్లకుండా పోలీసులు జిల్లా సరిహద్దుల్లో కాపలా కాస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం మురుగేశన్ (40) అనే వ్యక్తి మందు కొనుక్కోవడానికి పప్పినైచెంపట్టి చెక్ పోస్ట్ దాటే ప్రయత్నం చేశాడు. కొంతమంది పోలీసులు అతడిని పట్టుకుని విపరీతంగా కొట్టారు.
మురుగన్ ను పోలీసులు కొడుతున్న దృశ్యాలను అతడి స్నేహితుడు ఫోన్ లో చిత్రీకరించాడు. మురుగన్ నిలబడలేక కింద కూలిపోతున్నా కూడా పోలీసులు అతడిని బలవంతంగా పైకి లేపి కొడుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తీవ్ర గాయాలపాలైన అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మురుగన్ మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ ఘటన మీద సేలం సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ స్పందించారు.
మురుగన్ మృతికి కారణమైన పోలీసులమీద చర్యలు ఆదేశిస్తూనే అసలు విషయం వేరే ఉందని చెప్పుకొచ్చారు. ద్విచక్ర వాహానం మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు పోలీసులతో తీవ్రస్థాయిలో వాగ్వాదం పెట్టుకున్నారని, ఈ నేపథ్యంలో పోలీసులు వారిమీద లాఠీలతో ఛార్జ్ చేశారని ఎస్పీ చెప్పుకొచ్చారు.