
ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురిని పెళ్లి చేసుకుని మోసం చేసిన నిత్య పెళ్లికొడుకుని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే... రామనాథపురం జిల్లా కడలాడి సమీపంలోని బోధికులం గ్రామానికి చెందిన సతీశ్ కట్టెల వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలో అతను అదే గ్రామానికి చెందిన రేఖ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో రేఖతో విడిపోయి లతను వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లి కూడా పెటాకులవ్వడంతో మురుగలక్ష్మీ అనే యువతిని పెళ్లాడాడు. దీంతో భార్యను తీసుకుని అరుప్పుకోటైలో కాపురం పెట్టాడు.
అంతా సజావుగా సాగుతున్న సమయంలో అరుప్పుకోటైలోనే మేకలు మేపుతున్న 17 ఏళ్ల బాలికతో సతీష్‌కు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అనంతరం ఆమెకు మాయమాటలు చెప్పి యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే తన కుమార్తె కనపించడం లేదంటూ బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు బాలిక ఉళుందూరుపేటలోని సోదరి ఇంట్లో వున్నట్లు గుర్తించారు. అనంతరం ఆమెను రక్షించి విరుదునగర్‌లోని వసతి గృహంలో వుంచారు. ఆపై సతీశ్ కోసం వేట మొదలెట్టిన పోలీసులు అతను పాలవనత్తం ప్రాంతంలో వున్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. అనంతరం అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.