
కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ (Kapil Sibal) ఆ పార్టీకి రాజీనామా చేసి సమాజ్‌వాదీ పార్టీ (samajwadi party)తరపున రాజ్యసభ ఎన్నికల్లో (rajya sabha election) నామినేషన్ వేయడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఎస్పీలో చాలా మంది నేతలే వుండగా.. కపిల్‌ను అఖిలేశ్ యాదవ్ ఎందుకు ఎంచుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సంగతి పక్కనబెడితే... రాజ్యసభ ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని కోరిన కపిల్ సిబల్‌కు టీఎంసీ ఓ షరతు విధించినట్లు తెలుస్తోంది. ఈ షరతుకు అంగీకరించడం ఇష్టం లేకపోవడంతో ఆయన అఖిలేశ్ యాదవ్‌ను సంప్రదించినట్లు సమాచారం. అఖిలేశ్ ఎటువంటి షరతులు విధించకుండా మద్దతిచ్చేందుకు ముందుకు రావడంతో బుధవారం కపిల్ లక్నోలో నామినేషన్ దాఖలు చేశారు.
బుధవారం కపిల్ సిబాల్ మీడియాతో మాట్లాడుతూ, తాను కాంగ్రెస్‌కు మే 16న రాజీనామా చేశానట్లు తెలిపారు. తాను పార్లమెంటులో స్వతంత్ర గళం వినిపిస్తాన్నారు. బీజేపీ (BJP)కి వ్యతిరేకంగా పోరాడుతానని స్పష్టం చేశారు. అయితే కపిల్ సిబల్ తొలుత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ (Mamata Banerjee) నేతృత్వంలోని టీఎంసీ (TMC) మద్దతు కోరినట్లుగా సమాచారం. కానీ టీఎంసీలో చేరాలని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ (Abhishek Banarjee) కోరినట్లు ప్రచారం జరుగుతోంది. తన పేరు దగ్గర తృణమూల్ కాంగ్రెస్ అని ఉండటం కపిల్ సిబల్‌కు ఇష్టం లేదని, అందుకే ఆయన లక్నోలో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌ను సంప్రదించారని వాదనలు వినిపిస్తున్నాయి. అఖిలేశ్ ఆయనకు మద్దతిచ్చేందుకు ముందుకు రావడం మాత్రమే కాకుండా, తన కోసం తన పార్టీలో చేరవలసిన అవసరం లేదని చెప్పారని తెలుస్తోంది.
ALso Read:ఐదు నెలల్లో ఐదుగురు సీనియర్ నేతలు ఔట్.. ‘మునిగే నావ.. కాంగ్రెస్’
నిజానికి తృణమూల్ కాంగ్రెస్‌తో కొద్ది నెలల నుంచి కపిల్ సిబల్ చర్చలు జరుపుతున్నట్లు ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ టిక్కెట్‌పై రాజ్యసభ ఎంపీని కావాలని తాను కోరుకోవడం లేదని ఓ టీఎంసీ ఎంపీతో ఆయన చెప్పినట్లు కథనాలు వస్తున్నాయి. తనకు టీఎంసీ మద్దతిస్తుందా? అని కపిల్ సిబాల్ అడిగినట్లు సమాచారం. అయితే అన్ని ఏర్పాట్లు చేసుకుని , తీరా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసే సమయం వచ్చేసరికి తమ పార్టీలో చేరితేనే మద్దతిస్తామని మమత, అభిషేక్ స్పష్టం చేసినట్లు ఢిల్లీ టాక్. ఓ న్యాయవాదిగా కపిల్ సిబాల్, టీఎంసీ మధ్య సంబంధాలు సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం, టీఎంసీ తరపున అనేక కేసుల్లో ఆయన వాదనలు వినిపించారు.