భవానీపూర్ బైపోల్: నామినేషన్‌పై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అప్‌డేట్.. కాంగ్రెస్ క్లారిటీ

By telugu teamFirst Published Sep 8, 2021, 6:26 PM IST
Highlights

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శుక్రవారం భవానీపూర్ ఉపఎన్నికలో పోటీ చేయడానికి నామినేషన్ వేయనున్నారు. ఈ రోజు ప్రచారాన్ని ప్రారంభించిన ఆమె బీజేపీపై విమర్శలు చేశారు. కాగా, దీదీపై తాము పోటీ చేయబోమని, అలా చేస్తే అది బీజేపీకి పరోక్షంగా ఉపకరిస్తుందని కాంగ్రెస్ ప్రకటించింది.
 

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ రోజు భవానీపూర్ ఉపఎన్నిక కోసం ప్రచారం ప్రారంభించారు. నామినేషన్‌పైనా ఓ ప్రకటన చేశారు. శుక్రవారం(ఈ నెల 10న) నాడు తాను నామినేషన్ వేయనున్నట్టు వెల్లడించారు. కాగా, మమతా బెనర్జీపై తాము పోటీకోసం అభ్యర్థిని బరిలోకి దించబోమని కాంగ్రెస్ స్పష్టం చేసింది. కొంతకాలంగా దీనిపై పార్టీలో చర్చ జరిగింది. దీదీపై అభ్యర్థిని దించితే అది పరోక్షంగా బీజేపీకి ఉపకరిస్తుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. కాగా, లెఫ్ట్ ఫ్రంట్ కూడా ఇదే తరహా ప్రకటన చేసింది. ఉపఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన దీదీ బీజేపీపై విమర్శలు సంధించారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే టీఎంసీ నేతలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర దర్యాప్తు సంస్థలతో ఇబ్బందులు పెడుతున్నదని ఆరోపించారు. తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీపైనా రాజకీయంగా కక్ష కట్టిందని మండిపడ్డారు.

బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా శక్తియుక్తులన్ని కూడగట్టి అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ గెలిచిందని దీదీ అన్నారు. నందిగ్రామ్ ఎన్నికలో కుట్ర జరిగిందని, అందుకోసమే ఈ ఉపఎన్నికలో పోటీ చేయాల్సి వస్తున్నదని తెలిపారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అఖండ విజయం సాధించింది. కానీ, మమతా బెనర్జీ మాత్రం టీఎంసీ నుంచి బీజేపీలోకి మారిన సువేందు అధికారిపై పోరాడి ఓడారు. ఈ ఓటమినీ ఆమె కోర్టులో సవాల్ చేశారు. అయినప్పటికీ ఆమె బెంగాల్ సీఎంగా ప్రమాణం చేశారు. ఈ పదవిలో ఆమె కొనసాగాలంటే ఇప్పుడు భవానీపూర్ ఉపఎన్నికలో ఆమె కచ్చితంగా విజయం సాధించాల్సి ఉంటుంది.

మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచే తన రాజకీయ జీవితానికి పటిష్టమైన పునాదులు వేసుకున్నారు. తర్వాత భవానీపూర్ నుంచి రెండుసార్లు గెలుపొందారు. తాజాగా, మళ్లీ భవానీపూర్ నుంచి పోటీ చేయనున్నారు.

ఎనిమిది దశల్లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల జంగిపపర్, సంసేర్‌గంజ్‌లలో పోలింగ్ జరగలేదు. వీటితోపాటు భవానీపూర్‌లోనూ ఉపఎన్నికలు ఈ నెల 30న నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో భవానీపూర్ నుంచి టీఎంసీ టికెట్‌పై షోభాందేబ్ ఛటోపాధ్యాయ్ గెలుపొందారు. కానీ, దీదీ ఇక్కడి నుంచి పోటీచేయాలనుకుంటే తాను రాజీనామా చేయడానికి సిద్ధమని ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన రాజీనామా చేయడంతో ఇక్కడా ఉపఎన్నిక జరుగుతున్నది.

షోభాందేబ్ ఛటోపాధ్యాయ్‌కు మమతా బెనర్జీ ధన్యవాదాలు తెలుపుతూ ఆయన మంత్రిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. ఖార్దా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తారని చెప్పారు.

click me!