మీరు సానుభూతి కోసం పేదోడినంటారు.. అలాగంటే నేను అంటరానివాడిని.. నా చాయ్ కూడా ఎవరు తాగరు: గుజరాత్‌లో ఖర్గే

By Mahesh KFirst Published Nov 28, 2022, 1:59 PM IST
Highlights

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్‌లు పరస్పరం విమర్శలు సంధించుకుంటున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేపై ప్రధాని మోడీ కామెంట్లు చేయగా.. ఖర్గే కౌంటర్ ఇచ్చారు. 
 

గాంధీనగర్: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గుజరాత్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఘాటుగా వ్యాఖ్యానించారు. మీరు సానుభూతి కోసం పేదోళ్లమని చెబుతారని, కానీ, తాను అంటరానివాళ్లలో నుంచి వచ్చినవాడినని ప్రధాని మోడీపై ఖర్గే అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన గుజరాత్‌లోని నర్మదా జిల్లాలో దేడియాపాడలోని పబ్లిక్ ర్యాలీలో మల్లికార్జున్ ఖర్గే మాట్లాడారు.

‘మీ లాంటి వారు(పీఎం మోడీ) పేదోళ్లమని చెప్పుకుంటారు. దాని ద్వారా సానుభూతి జమకట్టుకుంటారు. కానీ, నేను అంటరానివాళ్ల నుంచి వచ్చినవాడిని. మీరు పెట్టే చాయ్ అయినా వేరే వాళ్లు తాగుతారు. కానీ, మేం పెట్టే చాయ్ తాగడానికి కూడా వెనుకాముందు ఆడతారు. అందుకే సింపథీ కోసం మాట్లాడే అలాంటి వ్యాఖ్యలు మానుకోవాలి. ఎందుకంటే ప్రజలు అమాయకులు కాదు’ అని అన్నారు.

‘ప్రజలకు ఒకసారి అబద్ధం చెబితే వింటారేమో. రెండో సారి అబద్ధాలు చెప్పినా వింటారేమో. కానీ, ఎన్నిసార్లు అబద్ధాలు చెబుతారు. ఆయన అసలు అబద్ధాల సర్దార్ అయ్యారు. ప్రజలు అమాయకులేమీ కాదు... గడిచిన 70 ఏళ్లల్లో కాంగ్రెస్ ఏం సాధించిందని తరుచూ వారు అడుగుతూ ఉంటారు. మీకు ప్రజాస్వామ్యం దక్కిందంటే అది కాంగ్రెస్ చలవే.. ’ అని పేర్కొన్నారు.

Also Read: Gujarat Assembly Elections: ఉగ్రవాదులను ప్రొత్సహించింది.. : కాంగ్రెస్ పై బీజేపీ విమర్శలు

అంతకు ముందు ఖేడాలో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. ‘కాంగ్రెస్ అధ్యక్షుడు ఈ రోజు గుజరాత్‌లో ఉన్నారు. సోనియా గాంధీ ఆయనను ఇక్కడికి పంపించారు. ఆయన ఇక్కడికి వచ్చి మోడీ స్థాయి ఏమిటో చూపిస్తా అని సవాల్ చేస్తున్నారు. నాకు అసలు స్టేటస్సే లేదు. నేను చాలా సాధారణ పౌరుడిలా జన్మించా. సరే.. ఆయన నా స్థాయిని ఎలా చూపిస్తారో చూద్దాం’ అంటూ నరేంద్ర మోడీ అన్నారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతల్లో జరగనున్నాయి. డిసెంబర్ 1వ తేదీ, 5వ తేదీన పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.

click me!