
ఒడిశాలోని పూరీ జిల్లాలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు 40 దుకాణాలు దగ్ధమయ్యాయి. ఆ సమయంలో షాపింగ్ కాంప్లెక్స్‌లో చిక్కుకుపోయిన 100 మందికి పైగా ప్రజలను అధికారులు రక్షించారు. వివరాలు.. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో గ్రాండ్ రోడ్‌లోని లక్ష్మీ మార్కెట్ కాంప్లెక్స్ మొదటి అంతస్తులో ఉన్న గార్మెంట్ స్టోర్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించారు. మంటలను ఆర్పేందుకు 12 ఫైరింజన్లు ఘటనాస్థలికి చేరుకున్నాయి.
జగన్నాథ ఆలయానికి సమీపంలో ఉన్న ఈ భవనంలో రెండు వేర్వేరు అంతస్తుల్లో హోటల్, బ్యాంకు ఉన్నాయి. మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన 106 మంది పర్యాటకులను హోటల్ నుంచి అధికారులు సురక్షితంగా రక్షించారు. ఇక, భవనం పైభాగంలో ఇరుక్కుపోయిన ముగ్గురు వ్యక్తులను అగ్నిమాపక సిబ్బంది అపస్మారక స్థితిలో రక్షించారని అధికారులు తెలిపారు.
మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ముగ్గురు సిబ్బంది వేడి, పొగ కారణంగా అస్వస్థతకు గురయ్యారని, వారిని ఆసుపత్రికి తరలించాల్సి వచ్చిందని ఫైర్ సర్వీస్ డైరెక్టర్ జనరల్ ఎస్‌కే ఉపాధ్యాయ తెలిపారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ.. మంటలు సమీపంలోని భవనాలకు వ్యాపించాయని కూడా ఆయన పేర్కొన్నారు.
పూరి సబ్ కలెక్టర్ భవతరణ్ సాహు మాట్లాడుతూ.. తాము ఇంకా అగ్నిప్రమాదానికి గల కారణాలను గుర్తించలేకపోయామని చెప్పారు. అయితే విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన బీజేప ఎమ్మెల్యే జయంత్ సారంగి.. పూరీలోని హోటళ్లు, ఇతర సంస్థలలో అగ్నిమాపక భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేయడంలో జిల్లా యంత్రాంగం విఫలమైందని ఆరోపించారు.